– సిబ్బంది, సామగ్రి సిద్ధం
– బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడితో కేంద్ర మంత్రులు
– వరద పరిస్థితులపై ఫోన్‌లో ఆరా
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 28: రాష్ట్రంలో వరద ప్రభావిత జిల్లాల పరిస్థితుల గురించి కేంద్ర మంత్రులు రాజ్‌నాథ్ సింగ్, జేపీ నడ్డాలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావుకు ఫోన్ చేసి తెలుసుకుని భరోసా ఇచ్చారు. మరిన్ని సహాయక చర్యలకు వీలుగా అవసరమైన మేరకు సిబ్బందిని, సామగ్రిని కేంద్రం నుంచి వెంటనే పంపేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఈ సందర్భంగా బీజేపీ బూత్ స్థాయి అధ్యక్షులు, ఆపై నాయకులతో రాపచందర్ రావు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించి భారీ వర్షాల నేపథ్యంలో సహాయక చర్యల్లో పాల్గొనాలని దిశానిర్దేశం చేశారు. అందరూ ప్రజలకు అందుబాటులో ఉండి, సహాయక చర్యల్లో కార్యకర్తలతో కలిసి చురుకుగా పాల్గొనాలన్నారు. వరద ప్రాంతాలకు ప్రభుత్వ సిబ్బంది, అధికారులు చేరుకోలేని పరిస్థితుల్లో లోతట్టు ప్రాంత ప్రజలకు ఆహారం, తాగునీరు, రవాణా సౌకర్యం కల్పించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. బీజేవైఎం కార్యకర్తలు, కార్పొరేటర్లు తక్షణమే సహాయక చర్యల్లో పాల్గొనాలని ఆదేశించారు. బాధితులను సురక్షిత ప్రదేశాలకు తరలించడం, అవసరమైన సామగ్రి పంపిణీ చేయడం వంటి కార్యక్రమాల్లో నిబద్ధతతో ఉండాలని రామచందర్ రావు పిలుపునిచ్చారు. మరోవైపు కేంద్ర మంత్రులు జి.కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్ వరద పరిస్థితులపై నిరంతరం సమీక్షలు నిర్వహిస్తున్నారన్నారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో కేంద్ర మంత్రులు చర్చించిల్ణ వరద ప్రభావిత ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు హెలికాప్టర్లు, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను మోహరింపజేయాలని విజ్ఞప్తి చేసినట్లు తెలిపారు. దీనిపై కేంద్రం సానుకూలంగా స్పందించి ప్రత్యేక హెలికాప్టర్లను పంపించినట్లు వివరించారు. ప్రస్తుతం హెలికాప్టర్లు, ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలను ముమ్మరంగా కొనసాగిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. వరద ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించే ప్రక్రియలో ఎన్డీఆర్‌ఎఫ్ టీంలు నిమగ్నమై ఉన్నాయని తెలిపారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం Prajatantra వెబ్‌సైట్‌ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్‌ను ఫాలో కండి. అలాగే మా ప్రజాతంత్ర యూట్యూబ్ చానల్‌ను సబ్ స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మరిచిపోవద్దు.


