బీసీలను దగా చేస్తున్న కాంగ్రెస్‌

– ధర్నా చౌక్‌లో బీజేపీ మహాధర్నాలో రామచందర్‌రావు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 2: బీసీలకు అనేక హామీలు ఇస్తూ కాంగ్రెస్‌ పార్టీ 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్‌ ప్రకటించిందని, బీసీ సంక్షేమానికి ఏడాదికి రూ.20 వేల కోట్లు, ఐదేళ్లలో రూ.లక్ష కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారని, కానీ ఇప్పుడు ఆ హామీలను పూర్తిగా మరిచిపోయారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రామచందర్‌రావు విమర్శించారు. బీసీల హక్కుల కోసం ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో జరిగిన బీజేపీ మహా ధర్నాలో ఆయన ప్రసంగించారు. సీఎం రేవంత్‌ రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా బీసీలకు 42శాతం రిజర్వేషన్ల బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెడితే బీజేపీ ఆ బిల్లుకు బేషరతుగా మద్దతు తెలపడంతో ఆ బిల్లు అసెంబ్లీలో పాస్‌ అయిందని, అయితే ఐదారు నెలలు గడిచినా ఎలాంటి కార్యాచరణ చేపట్టలేదని ఆరోపించారు. హైకోర్టు మూడు నెలల్లోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలంటూ చివాట్లు పెట్టిన తర్వాతనే కాంగ్రెస్‌ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లపై ఆర్డినెన్స్‌ తీసుకొచ్చింది. 243-డి(6) క్లాజ్‌ ప్రకారం స్థానిక సంస్థల రిజర్వేషన్లను నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికే ఉంది. అయినా రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం తన బాధ్యతను నిర్వర్తించకుండా తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు కేంద్రంపై నిందలు వేస్తోందని ఆయన విమర్శించారు. కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండా డిక్లరేషన్‌ను విడుదల చేశారు.. ఇప్పుడు ఆ బిల్లును అమలు చేయాల్సిన బాధ్యత కూడా రాష్ట్రానిదేనని స్పష్టం చేశారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సమాధానం చెప్పాలని, రిజర్వేషన్ల విషయంలో బీసీలను మోసం చేస్తున్న ముఖ్యమంత్రి ప్రజలకు క్షమాపణ చెప్పాలని నిలదీశారు. బీసీ సామాజికవర్గానికి చెందిన నరేంద్ర మోదీని ప్రధానమంత్రిగా చేసింది బీజేపీి. బీసీ కమిషన్‌ను తీసుకొచ్చి దానికి రాజ్యాంగబద్ధత కల్పించింది కూడా బీజేపీియే. 1947 నుంచి ఇప్పటివరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గానీ, తెలంగాణలో గానీ ఒక్క బీసీని కూడా ముఖ్యమంత్రిగా చేయని పార్టీ కాంగ్రెస్‌ అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలోని తొమ్మిది కార్పొరేషన్‌లకు చైర్మన్లను నియమించగా వారిలో కేవలం ఒక్కరే బీసీ కావడం కాంగ్రెస్‌ వైఖరిని తెలుపుతోందన్నారు. బీఆర్‌ఎస్‌ హయాంలో ఎంబీసీ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశారు.. కానీ ఎంబీసీల సంక్షేమం కోసం తగిన విధంగా పనిచేయలేదని, సంచార జాతులు సహా అనేక బీసీ కులాల అభివృద్ధిపై దృష్టి పెట్టలేదని రామచందర్‌రావు చెప్పారు. బీసీలకు పెద్దపీట వేస్తున్న బీజేపీకి బీసీ సమాజం అండగా ఉందని, ఈ విషయాన్ని తెలుసుకున్న కాంగ్రెస్‌ పార్టీ బీసీలను బీజేపీ నుంచి దూరం చేయాలనే కుట్ర చేస్తోందని అన్నారు. బడుగు బలహీనవర్గాల అభివృద్ధికే బీజేపీ విధానాలు కేంద్రీకృతమై ఉన్నాయని, ముద్ర లోన్లు, స్టార్టప్‌ ఇండియా, స్టాండప్‌ ఇండియా వంటి పథకాలు బీసీల సంక్షేమం కోసం తీసుకొచ్చిందని చెప్పారు. యూపీఏ హయాంలో కేంద్రంలో చిదంబరం మంత్రి పదవిలో ఉన్నప్పుడు 2011లో సామాజిక, ఆర్థిక, విద్య, రాజకీయ, కుల స్థితిగతులపై కులగణన జరిపారు కానీ ఆ గణాంకాలను ఎందుకు బుట్టదాఖలు చేశారు అని రామచందర్‌రావు ప్రశ్నించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *