Rakhi: కేటీఆర్‌కు రాఖీ కట్టిన లగచర్ల గిరిజన మహిళలు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 8: భారత రాష్ట్ర సమితి(బీఆర్‌ఎస్‌) వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు కొడంగల్‌ నుంచి వచ్చిన గిరిజన మహిళలు రాఖీ కట్టి తమ కృతజ్ఞతను చాటుకున్నారు. ప్రభుత్వం తమ జీవితాలను, జీవనాధారమైన వ్యవసాయ భూములను లాక్కున్నప్పుడు తమకు ఒక అన్నలా అండగా నిలిచిన కేటీఆర్‌కు రాఖీ కట్టామని వారు తెలిపారు. కొడంగల్‌ మండలం లగచర్ల గ్రామం రోటిబండ తండాకు చెందిన జ్యోతి, మరికొందరు మహిళలు కేటీఆర్‌ నివాసానికి వెళ్లి రాఖీ కట్టారు. లగచర్ల భూ పోరాటం సమయంలో నిండు గర్భిణిగా ఉన్న జ్యోతిపై రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, పోలీసులు దౌర్జన్యం చేశారని, ఆమె భర్తను జైలుకు పంపిన, సమయంలో కేటీఆర్‌ దిల్లీ వెళ్లి పలు కమిషన్లకు ఫిర్యాదులు చేసి, జ్యోతితోపాటు లగచర్ల గిరిజనులకు, పేద రైతన్నలకు జరుగుతున్న అన్యాయాన్ని దిల్లీ వేదికగా ఎండగట్టారు. ఫలితంగా ప్రభుత్వం భూసేకరణను వెనక్కి తీసుకుందని వారు తెలిపారు. కేసుల కారణంగా జైలుపాలైన లగచర్ల సోదర సోదరీమణులందరికీ కేటీఆర్‌ అన్నగా అండగా నిలబడి న్యాయ సహాయం అందించారని, అందరినీ జైలు నుంచి విడిపించారని వారు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *