Rakhi gift: రాఖీ కానుకగా డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు

ఇండ్ల పేరిట పేదలను దోచుకున్న బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం
– పట్టణ పేదలకు దశలవారీగా ఇందిరమ్మ ఇండ్లు
– కేసీఆర్‌ కుటుంబం కాసుల కక్కుర్తి వల్లే కాళేశ్వరం కూలింది
– రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి

వరంగల్‌/హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్టు 8: ఆరేళ్లకుపైగా డబుల్‌ బెడ్‌ ఇండ్ల (double bed room) ఆశలు చూపి గత బీఆర్‌ఎస్‌(BRS) ప్రభుత్వం ప్రతి ఒక్కరి వద్ద అక్రమ వసూళ్లు చేసి పేదలను దోచుకుందని రెవెన్యూ, హౌసింగ్‌, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivasareddy) ఆరోపించారు. రెండు ఎన్నికల్లో ఇవే ఇండ్లను చూపిస్తూ ఎవరికీ ఇవ్వలేదని, మూడోసారి కూడా మోసం చేసేందుకు ప్రయత్నిస్తే ప్రజలు తగు రీతిలో బుద్ది చెప్పారని అన్నారు. వరంగల్‌ జిల్లా హనుమకొండ బాల సముద్రం ప్రాంతంలో శుక్రవారం 592మంది లబ్దిదారులకు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లను అందజేసిన మంత్రి పొంగులేటి దగ్గరుండి మరీ గృహ ప్రవేశాలు చేయించారు. ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌ రెడ్డి, నాగరాజు, మేయర్‌ గుండు సుధారాణి తదితరుల సమక్షంలో ఆనందోత్సాహాల నడుమ ఈ కార్యక్రమం జరిగింది. ఈ సంర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ పార్టీలకతీతంగా ఎంతో పారదర్శకంగా లబ్దిదారుల ఎంపిక జరిగిందని తెలిపారు. గత ప్రభుత్వంలో కేవలం ఆ పార్టీ కార్యకర్తలకు, కొందరు ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే ఇండ్లు మంజూరయ్యాయని ఆరోపించారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకేగాక పట్టణ పేదలకు గృహ వసతి కల్పించేందుకు ఇందిరమ్మ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ శ్రావణ మాస శుక్రవారం 592 మంది గృహ ప్రవేశాలు చేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ ఇండ్లను మహిళల పేరిటే మంజూరు చేశామని, ఒక రోజు ముందుగా 592 మంది అక్కచెల్లెళ్లకు రాఖీ పౌర్ణమి కానుక అందినట్లయిందని మంత్రి అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నేతృత్వంలో ఈ ప్రభుత్వం దశల వారీగా ఆరు హామీలను అమలు చేస్తున్న విషయం గమనించాలని కోరారు.

కమీషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు

తెలంగాణ ప్రజలకు వెన్నుపోటు పొడిచేలా కాళేశ్వరం (Kaleswaram) ప్రాజెక్టులో బీఆర్‌ఎస్‌ నేతలు కమీషన్ల కక్కుర్తికి పాల్పడ్డాని మంత్రి పొంగులేటి ఆరోపించారు. వారి అవినీతి వల్లే కాళేశ్వరం కూలిందన్నారు. వేల కోట్ల రూపాయలు కేసీఆర్‌ కుటుంబానికి చేరాయన్నారు. దోచుకున్నది దాచుకోవడానికే బీఆర్‌ఎస్‌ నాయకులు తిరిగి ప్రభుత్వంపై దాడికి దిగుతున్నారని విమర్శించారు. కాగా, దేశంలో బీసీ కులగణన చేసిన తొలి రాష్ట్రం తెలంగాణ మాత్రమేనంటూ 42 శాతం బీసీ కోటా అమలు చేస్తామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *