– రాజీవ్ వర్థంతి కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్
ప్రధానిగా దేశానికే వన్నె తెచ్చిన మహా నాయకుడు రాజీవ్ గాంధీ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. భారతరత్న, మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా సెక్రటేరియట్ ఎదురుగా ఆ మహనీయుడి విగ్రహానికి ఆయన పుష్పాంజలి ఘటించిన అనంతరం ప్రసంగించారు. సరళీకృత ఆర్ధిక విధానాలతో దేశాన్ని బలమైన ఆర్ధిక దేశంగా నిలబెట్టిన ఘనత రాజీవ్ గాంధీదేనన్నారు. యువతకు 18 ఏళ్లకే ఓటు హక్కును కల్పించి ప్రభుత్వాల ఏర్పాటులో యువతకు భాగస్వామ్యం కల్పించారని గుర్తుచేశారు. పహల్గామ్ ఘటన నేపథ్యంలో ఆనాటి ప్రధాని ఇందిరమ్మ స్ఫూర్తిని దేశంలో ప్రతీ ఒక్కరు గుర్తు తెచ్చుకున్నారన్నారు. తీవ్రవాదుల ముసుగులో దేశ పౌరులపై దాడులకు తెగబడితే ఆనాడు ఇందిరమ్మ పాకిస్థాన్ కు గట్టి గుణపాఠం చెప్పిందన్నారు. మా దేశాన్ని మేం రక్షించుకోగలుగుతాం.. ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదని ఇందిరమ్మ ఆనాడే స్పష్టం చేశారని గుర్తు చేశారు. ప్రస్తుతం పహల్గామ్ ఘటనలో పాకిస్థాన్ కు బుద్ది చెప్పడంలో ప్రధాని వెనకడుగు వేశారన్నారు.
ట్రంప్ చెబితే కేంద్ర ప్రభుత్వం కాల్పుల విరమణ చేసిన పరిస్థితి ఇప్పటి కేంద్ర ప్రభుత్వానిదంటూ ఎద్దే వా చేశారు. రాహుల్ గాంధీని విమర్శించడం ద్వారా బీజేపీ నాయకులు తమ చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కేంద్ర మంత్రిగా కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలబడాల్సిన సమయంలో కిషన్ రెడ్డి నిస్తేజంగా వున్నారంటూ ఆరోపించారు. తాము బయటకు వచ్చి కేంద్రానికి అండగా ఉన్నామని ప్రకటించి మద్దతు తెలిపాం. ఆనాడు కనీసం మమ్మల్ని అభినందించని వ్యక్తి ఇవాళ రాహుల్ గాంధీ గారిని విమర్శించడం విచిత్రమన్నారు.
తన చేతగానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకే కిషన్ రెడ్డి రాహుల్ గాంధీపై విమర్శలు చేస్తున్నారన్నారు. సెక్రటేరియట్ దగ్గర రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే కొందరు విమర్శలు చేశారు. సంకుచిత మనస్తత్వం కలిగిన వారు మాత్రమే రాజీవ్ గాంధీని విమర్శిస్తున్నారన్నారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన చరిత్ర గాంధీ కుటుంబానిది, కాంగ్రెస్ పార్టీదన్నారు. దేశ రక్షణ కోసం భారత జవాన్లకు అండగా నిలబడతాం.. అది మా బాధ్యత అన్నారు. దేశ సమగ్రత విషయంలో మేం రాజకీయాలు చేయం.. దేశ భద్రతకు మేం కట్టుబడి పనిచేస్తామన్నారు.





