రాజాసింగ్‌ రాజీనామా లేఖ ఆమోదం

న్యూదిల్లీ, జులై 11: గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ రాజీనామా లేఖను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆమోదించారు. ఇటీవల ఎమ్మెల్యే పదవికి, పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు రాజాసింగ్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. కాగా, బీజేపీలో రెబల్‌ ఎమ్మెల్యేగా ముద్రపడ్డ రాజాసింగ్‌ కొద్ది రోజులుగా పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్ష పదవికి జరిగిన ఎన్నికల సమయంలో నామినేషన్‌ వేసేందుకు పార్టీ కార్యాలయానికి వచ్చిన తనను కొందరు అడ్డుకున్నారని, దీంతో పార్టీ సభ్యత్వానికి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఆ రాజీనామా లేఖను పార్టీ అప్పటి రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌ రెడ్డికి పంపినట్లు తెలిపారు. పార్టీ అధ్యక్షుడిగా రామచందర్‌రావు నియామకంపై రాజాసింగ్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయనను అధ్యక్షుడిగా ప్రకటించిన వెంటనే తన ఎమ్మెల్యే పదవికి, పార్టీకి రాజీనామా చేశారు. దాదాపు 15 రోజుల తర్వాత బీజేపీ జాతీయ నాయకత్వం దీనిపై దృష్టి సారించింది. అందులో భాగంగా రాజాసింగ్‌ రాజీనామాకు జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆమోదం తెలిపినట్లు హైకమాండ్‌ లేఖను విడుదల చేసింది. ఈ లేఖలో నడ్డా కీలక అంశాలను ప్రస్తావించారు. రాజాసింగ్‌ ప్రస్తావించిన విషయాలు అసంబద్ధమని, పార్టీ పనితీరు, భావజాలం, సూత్రాలకు విరుద్ధంగా ఉన్నాయంటూ పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *