– ఉపరితల ఆవర్తన ప్రభావం
– జూన్ మొదటివారంలో రుతుపవనాలు
– రానున్న 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమల్లో వర్షాలు
మరో నాలుగు రోజులపాటు రాష్ట్రంలో వర్షాలు కురియనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పాడిన ద్రోణి, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో మరో నాలుగు రోజులపాటు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. సోమ, మంగళవారాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు, మరికొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు తెలిపింది. నేడు కామారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్, నారాయణ్‌పేట్, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ, గద్వాల్ జిల్లాల్లో ఉరుములు మెరుపులు, ఈదురుగాలులతో కూడిన మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశమున్నట్లు పేర్కొంది. ఈ మేరకు ఆయా జిల్లాల్లో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వర్షాల కారణంగా ఎండ తీవ్రత తగ్గనుంది. పగటిపూట ఉష్ణోగ్రతలు ఐదు డిగ్రీల మేర తగ్గే అవకాశముంది.
బంగాళాఖాతం, అరేబియా సముద్రంలో నైరుతి రుతుపవనాలు మరింత వేగంగా విస్తరిస్తున్నాయి. ప్రస్తుతం అండమాన్ నికోబార్ దీవుల్లో రుతుపవనాలు పూర్తిగా విస్తరించి ఉన్నాయి. తొలుత ఈ నెల 27న కేరళ తీరాన్ని తాకుతాయని ఐఎండీ అంచనా వేసింది. అయితే, కాస్త ముందుగా 24నే కేరళ తీరంలోకి ప్రవేశించి, జూన్ మొదటి వారంలోనే రాష్ట్రం లోకి ప్రవేశించే అవకాశాలు కనిపిస్తున్నాయి.రెండు మూడు రోజుల్లో దక్షిణ అరేబియా, మాల్దీవులు, కొమోరిన్ సహా బంగాళాఖాతం లోని మరిన్ని ప్రాంతాలకు విస్తరించనున్నాయి. మరోవైపు మధ్య మహారాష్ట్ర సహా కర్ణాటక, ఆంధప్రదేశ్‌లోని రాయలసీమ వరకు 0.9 కి. ఎత్తులో ఓ ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఆగ్నేయ బంగాళాఖాతం నుంచి కోస్తాంధ్ర, రాయలసీమ దుగా కర్ణాటక వరకు మరో ద్రోణి కొనసాగుతోంది. వీటి ప్రభావంతో రానున్న 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముంది.





