రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా వర్షాలు

– హైదరాబాద్‌లో వాన బీభ‌త్సం
– పొంగి పొర్లిన నాలాలు..  ట్రాఫిక్‌ ‌జామ్‌
– అవసరమైతే తప్ప బయటకు రావొద్దని హెచ్చరిక

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఆగస్ట్ 4:  ‌కొన్నిరోజులుగా వర్షాలు లేక పంటలు ఎండుతున్న రైతులకు వాతావరణం చల్లటి కబురు చెప్పింది. సోమవారం తెలంగాణ వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లో కుండపోత వాన కురవడంతో రాష్ట్రం అంతటా విస్తరించే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. అనుకున్నట్లుగానే వర్షాలు రాష్ట్రమంతటా విస్తరించాయి. పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తుంటే.. మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండటం రైతులకు కాస్త ఊరటనిచ్చే అంశమని చెప్పవచ్చు. రంగారెడ్డి, వికారదాబాద్‌, ‌నల్గొండ జిల్లాల్లో కొన్ని ఏరియాల్లో వర్షాలు కురుస్తున్నాయి. ఆదిలాబాద్‌, ‌జగిత్యాల, జనగామ‌, జయశంకర్‌ ‌భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్‌, ‌మహబూబ్‌ ‌నగర్‌, ‌మంచిర్యాలు, మెదక్‌, ‌నాగర్‌ ‌కర్నూల్‌, ‌నల్గొండ, నారాయణపేట, నిర్మల్‌, ‌నిజామాబాద్‌, ‌పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్‌, ‌వనపర్తి, జిల్లాలలో తదుపరి 2-3 గంటల్లో తేలికపాటి వర్షం కురిసే ఛాన్స్ ఉం‌దని వాతావరణ కేంద్రం తెలిపింది. గాలి వేగం  గరిష్టంగా గంటకు 40 కి. కంటే తక్కువ (గాలులలో)  ఉండగా.. తేలికపాటి ఉరుములతో కూడిన వర్షాలు వచ్చే అవకాశం వుందని తెలిపారు. మరోవైపు హైదరాబాద్‌, ‌కొమరం భీమ్‌ ఆసిఫాబాద్‌, ‌మేడ్చల్‌ ‌మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, జిల్లాలలో తదుపరి 2-3 గంటల్లో మోస్తరు వర్షం వచ్చే అవకాశం వుంది.హైదరాబాద్‌ ‌లో వాన బీభత్సం సృష్టించింది. సోమవారం మధ్యాహ్నం మొదలైన వాన నాన్‌ ‌స్టాప్‌ ‌గా కురుస్తూ నగరాన్ని ముంచేసింది. కుండపోత అనే పదం కూడా తక్కువే అన్నట్లుగా కురిసిన వానకు నగరంలో ఎక్కడ చూసినా నీళ్లతో వాగులు, చెరువులను తలపించాయి. రోడ్లన్నీ నదులను గుర్తు చేశాయి. సుమారు గంటకు పైగా వర్షం కురుస్తూనే ఉంది.  పలు ప్రాంతాల్లోమోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తోంది. ఇవాళ కురిసిన వర్షంలో సిటీలోనే సంపన్న ఏరియాగా పేరున్న  జూబ్లీహిల్స్ ‌లో అత్యధిక వర్షపాతం నమోదైంది. జడివాన కురిసినట్లుగా వర్షం దంచికొట్టడంతో జూబ్లీహిల్స్ ‌లో 7.4 వర్షపాతం నమోదైనట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. గంటలోగా ఇంత వర్షపాతం నమోదవ్వడం చాలా కాలం తర్వాత నగర వాసులు చూస్తున్నారు. జూబ్లీహిల్స్ ‌తర్వాత మెహిదీపట్నంలో 5.3 వర్షం కురిసింది. ఆ తర్వాత  శ్రీనగర్‌ ‌కాలనీ లో 5 సెంటీ టర్ల వాన నమోదైంది. ఆ తర్వాత వర్షపాతం వరుసగా  బంజారాహిల్స్ 4.6,  ‌యూసఫ్‌ ‌గూడా 3.9,  ఖైరతాబాద్‌ 3.6, ‌మైత్రివనం 3.4,  కూకట్‌ ‌పల్లి3, మెహిదీపట్నం  3 సెంటీటర్ల వర్షపాతం నమోందైంది. మరోవైపు రాజేంద్రనగర్‌, ‌కాప్రా, చర్లపల్లి, గాంధీభవన్‌, అత్తాపూర్‌, ‌ఫలక్నామా, మల్కాజిగిరి, మూసాపేట్‌, ఏఎస్‌ ‌రావు నగర్‌, ‌మాదాపూర్‌, ‌మల్లపల్లి, గోషామహల్‌, ఆనంద్‌ ‌బాగ్‌ ఏరియాల్లో  2 శాతం వర్షం కురిసినట్లు వాతావరణ కేంద్రం పేర్కొంది. ఇక  భారీ వర్షం కారణంగా నగరవాసులు బయటికి రావద్దని సిటీ ట్రాఫిక్‌ ‌పోలీసులు, హైడ్రా అధికారులు సూచించారు. నాలాలు పొంగుతుండటంతో ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని తెలిపారు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్‌ ‌జాం అవుతున్న కారణంగా.. రోడ్లపైకి వొస్తే ట్రాఫిక్‌ ‌లో ఇరుక్కుంటారని హెచ్చరించారు. వాన నిలిచే వరకు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు. హైదరాబాద్‌ ‌లో ఎన్నడూ లేనంత వాన కురుస్తోంది. దీంతో నగరంలో వీధులన్నీ జలమయమ‌య్యాయి. భారీ వరద కారణంగారోడ్లు వాగులు, నదులను తలపిస్తున్నాయి. నాలాలు పొంగుతున్నాయి. పట్టగలే సాయంత్రం అయినట్లుగా మారిపోయింది పరిస్థితి. దీంతో పోలీసులు వాహనదారులకు, హైదరాబాదీలకు సూచనలు చేశారు. అదే విధంగా ఆఫీసుల్లో ఉన్న వాళ్లు వర్షం నిలిచే వరకు బయల్దేరవద్దని హెచ్చరించారు. భారీగా వరద పారుతుండటంతో రోడ్లపైన వాహనాలు కొట్టుకుపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. భారీగా ట్రాఫిక్‌ ‌జాం అయ్యే అవకాశం ఉండటంతో వర్షం కాస్త రిలీఫ్‌ ఇచ్చిన తర్వాతే బయలు దేరాలని సూచించారు పోలీసులు. సిటీ మొత్తానికి ఉరుములు, మెరుపులు, పిడుగులు పడే చాన్స్ ఉం‌దని.. ఎక్కడ ఉన్నవాళ్లు అక్కడే ఉండాలని సూచించారు. నగరవాసులు ఏదైనా ప్రదామానికి గురైతే 100 కు డయల్‌ ‌చేయాలని సూచించారు.

అధికారులు అప్రమత్తంగా ఉండాలి: సీఎం ఆదేశాలు

హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర సచివాలయంలో ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా మాట్లాడారు. భారీ వర్షాలు కురిసిన ప్రాంతాల్లో ప్రజలకు ఇబ్బంది లేకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని, లోతట్టు ప్రాంతాల్లో తగిన సహాయక చర్యలు చేపట్టాలని సూచించారు. జీహెచ్‌ఎంసీతోపాటు రాష్ట్రవ్యాప్తంగా వరద నీటి ఉద్ధృతి ఉన్న ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. రానున్న రెండుమూడు రోజులు వర్షాలు ఉంటాయనే సమాచారం ఉన్నందున కలెక్టర్లు జిల్లాల్లోని అన్ని విభాగాలతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని, ఎక్కడా ఆస్తి, ప్రాణ నష్టం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. వర్షాలు, వరదలతో ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎదుర్కొనేందుకు, ఎలాంటి సహాయమైనా అందించేందుకు అధికారులు జిల్లాల్లోనే అందుబాటులో ఉండాలని సీఎం ఆదేశించారు. ఉన్నతాధికారులు జిల్లా కలెక్టర్లతో మాట్లాడి ఎప్పడికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని సూచించారు. విపత్తు సహాయక బృందాలు అందుబాటులో ఉండాలని, తక్షణమే స్పందించాలని ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *