– కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో కోలుకోలేని నష్టం
– కొట్టుకుపోయిన రోడ్లు
-రాకపోకలకు అంతరాయం
– చెరువులను తలపిస్తున్న వూళ్లు
– ముమ్మరంగా సహాయ కార్యక్రమాలు
నిజామాబాద్, కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో కుండల్లోనుంచి ఒక్కసారిగా పడిన నీరు మాదిరిగా కురిసిన అతిభారీ వర్షం ప్రజాజీవనాన్ని అస్తవ్యస్తం చేసింది. జాతీయ రహదారితో సహా వివిధ రోడ్లు కొట్టుకు పోవడం లేదా దెబ్బతినడంతో నిజామాబాద్-హైదరాబాద్ మధ్య రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ముఖ్యంగా కామారెడ్డిలో నివాస ప్రాంతాలు, పొలాలు చెరువులను తలపిస్తున్నాయి. కామారెడ్డి -భిక్కనూర్ మార్గంలో రైలు పట్టాల కింద వరద పోటెత్తడంతో భారీ గండిపడింది. ఫలితంగా రైల్వేశాఖ పలు రైళ్లను రద్దు చేసి మరికొన్నింటిని దారి మళ్లించింది. మరోవైపు ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలో భారీ వర్షం కురిసినట్లు తెలుస్తోంది.
నిజామాబాద్/ కామారెడ్డి/ హైదరాబాద్/ కరీంనగర్/ ఖమ్మం, ప్రజాతంత్ర,ఆగస్ట్28: అల్పపీడనం అతలాకుతలం చేసింది. అల్పపీడన ప్రభావంతో కామారెడ్డి, మెదక్, నిర్మల్ జిల్లాల్లో మంగళవారం రాత్రి నుంచి బుధవారం రాత్రి వరకు కుంభవృష్టి కురియడంతో భారీ నష్టం జరిగింది. చెరువుల, కాలువులు పొంగిపొర్లాయి. కల్వర్టులు, రోడ్లు తెగాయి. ముఖ్యంగా కామారెడ్డి, మెదక్ జిల్లాలు భారీ వర్షాలతో ఉక్కిరిబిక్కిరి అయ్యాయి. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురిశాయి. భారీ వర్షాల నేపథ్యంలో కామారెడ్డి, మెదక్ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. కామారెడ్డి జిల్లాలో కురిసిన భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. పంట పొలాలు, నివాస ప్రాంతాలు చెరువులను తలపించాయి. దాదాపు పంటలన్నీ దెబ్బతిన్నాయి. కామారెడ్డి -భిక్కనూర్ మార్గంలో రైలు పట్టాల కింద వరద పోటెత్తడంతో భారీ గండిపడింది. దీంతో అధికారులు రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో వాగు ఉధృతికి కార్లు వరద ప్రవాహంలో కొట్టుకుపోయాయి. హౌసింగ్ బోర్డు కాలనీలో ఇళ్లలోకి నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కామారెడ్డి, మెదక్ జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో గురువారం ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు అధికారులు సెలవులు ప్రకటించారు. మెదక్, నిర్మల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ పేర్కొంది. భారీ వర్షాలు, వరదల ప్రభావిత ప్రాంతాల్లో సీఎం రేవంత్‌రెడ్డి ఏరియల్ సర్వే నిర్వహించ నున్నారు. మరోవైపు భారీ వర్షాల దృష్ట్యా తెలంగాణ వర్సిటీ పరిధిలో పరీక్షలు వాయిదా పడ్డాయి. శుక్రవారం యథాతథంగా పరీక్షలు నిర్వహించనున్నట్లు వీసీ యాదగిరిరావు పేర్కొన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో అధికంగా వరద రావడంతో పోచారం ప్రాజెక్టు కట్ట కోతకు గురి అయింది. బుధవారం రాత్రి వరద నీరు అధికంగా రావడంతో అలుగు సపంలో కట్ట కోతకు గురి అయిందని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. దానితో ప్రాజెక్టుకు ఎలాంటి ప్రమాదం లేదని నీటిపారుదల శాఖ డీఈ వెంకటేశ్వర్లు చెప్పారు. కోతకు గురైన ప్రాంతంలో ఇసుక బస్తాలను వేయిస్తామని పేర్కొన్నారు. దోమకొండ మండలం సంగమేశ్వర్ ఎడ్లకట్ట వాగు సపంలో వరదలో చిక్కుకొని కారుతో సహా తండ్రీకొడుకులు వాగులో కొట్టుకుపోయారు. దోమకొండకు చెందిన ఆర్‌ఎంపీ డాక్టర్ మేక చిన్న హరిశంకర్, ఆయన కుమారుడు మహేశ్ తమ కారులో.. గోడకూలి మృత్యువాత పడ్డ తన మేనల్లుడి అంత్యక్రియల కోసం వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. కారుపై కూర్చొని సాయం చేయాలంటూ సైగలు, అరుపులు చేశారు. ఇది గమనించిన సంగమేశ్వర్ గ్రామస్థులు జేసీబీ సాయంతో కాపాడేందుకు ప్రయత్నించారు. కానీ సాధ్యం కాలేదు. ప్రవాహంలో కొట్టుకుపోతూ చివరకు చెట్టును పట్టుకొని అలాగే ఉండిపోయారు. దాదాపు 9 గంటల నరకయాతన అనుభవించిన అనంతరం వరద ఉద్ధృతి తగ్గడంతో వ్యవసాయ భూముల నుంచి పాక్కుంటూ బయటకు వచ్చారు. వారు సురక్షితంగా బయటపడటంతో గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు. కామారెడ్డి ఎల్లారెడ్డి మార్గంలో లక్ష్మాపూర్ గ్రామం వద్ద రోడ్డు కోతకు గురైంది. రాజంపేట మండల కేంద్రంలో వర్షానికి గోడ కూలి యువ వైద్యుడు మృతి చెందాడు. రాజంపేటకు చెందిన వినయ్ (28) గుండారం పల్లె దవాఖానాలో వైద్యుడిగా పని చేస్తున్నారు. భారీ వర్షానికి రాజంపేటలోని దేవుని చెరువు కట్ట తెగి వినయ్ ఇంట్లోకి వరద నీరు చేరింది. నీటిని బయటకు మళ్లించేందుకు గడ్డపారతో గోడకు రంధ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తూ గోడ కూలి మీద పడటంతో వైద్యుడు వినయ్ అక్కడిక్కడే మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. రాజంపేట మండలంలోని 3 తండాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. బీబీపేట మండలంలో 9 మంది యువకులు చెరువు కట్టపై ఇరుక్కు పోయారు. కామారెడ్డి జిల్లా తిమ్మారెడ్డిలోని కల్యాణి వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వాగుపై బొగ్గు గుడిసె సమీపంలో బ్రిడ్జి నిర్మాణ పనులు చేపడుతున్న ఆరుగురు కార్మికులు వరదలో చిక్కుకున్నారు. ఈ వరద కారణంగా కామారెడ్డి- భిక్కనూర్ సమీపంలో రైలు పట్టాల కింద గండిపడింది. దీంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి.ఉమ్మడి ఆదిలాబాద్‌లోని బుధవారం రాత్రి పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. భారీ వర్షాల నేపథ్యంలో గురువారం ఆదిలాబాద్, నిర్మల్, కుమురం భీం జిల్లాల్లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు అధికారులు సెలవులు ప్రకటించారు. కడెం ప్రాజెక్టు నాలుగు గేట్లు ఎత్తి 20వేల క్యూసెక్కుల నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు లోతట్లు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం ఎగువ మానేరు ప్రాజెక్టు వద్ద చిక్కుకున్న వారికోసం డ్రోన్ సహాయంతో ఆహార పదార్థాల చేరవేత చేపట్టారు. అల్పపీడన ప్రభావంతో మెదక్ జిల్లాలో భారీ వర్షాలు దంచికొట్టాయి. దీంతో వరద ఉద్ధృతికి వాగులు, వంకలు పొంగిపొర్లాయి. హవేలిఘనపూర్ మండలం రాజపేటతండాలోని వాగులో 10 మంది స్థానికులు చిక్కుకుపోయారు. అధికారుల సూచనతో లెప్ట్‌నెంట్ కల్నల్ నిఖిల్ ఆధ్వర్యంలో ఆర్మీ బృందం రంగంలోకి దిగింది. 30 మంది జవానులు రాజాపేటకు చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. పాపన్నపేట మండలం ఎల్లాపూర్ వంతెన వద్ద మంజీరా నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. నది ప్రవాహదాటికి వంతెన పైకి వరద నీరు చేరింది. వరద కారణంగా మంబోజిపల్లి నుంచి ఎల్లాపూర్ వైపు అధికారులు రాకపోకలు నిలిపివేశారు. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఆర్గొండలో అత్యధికంగా 43.1 సెం. వర్షం కురిసింది. నిర్మల్ జిల్లా అక్కాపూర్‌లో 32.3 సెం., మెదక్ జిల్లా సర్దానలో 30.2 సెం., కామారెడ్డి పట్టణంలో 28.9 సెం., కామారెడ్డి జిల్లా భిక్‌నూర్‌లో 27.9 సెం., నిర్మల్ జిల్లా వడ్యాల్‌లో 27.9 సెం., కామారెడ్డి జిల్లా తాడ్వాయిలో 27.5 సెం., మెదక్‌జిల్లా నాగాపూర్ గ్రామంలో 26.6 సెం., కామారెడ్డి జిల్లా పాత రాజంపేటలో 24.6 సెం., లింగంపేటలో 22.5 సెం., దోమకొండలో 20.2 సెం., నిర్మల్ జిల్లా విశ్వనాథ్‌పేట్‌లో 24.1 సెం., ముజిగిలో 23.1 సెం., మెదక్ జిల్లా చేగుంటలో 20.2 సెం.ల వర్షం పాతం నమోదైంది.
కామారెడ్డి జిల్లాలో విధ్వంసం
కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి. కుంభవృష్టి ధాటికి పలుచోట్ల జనజీవనం స్తంభించిపోయింది. చాలా ప్రాంతాల్లో రోడ్లు ధ్వంసమయ్యాయి. బీబీపేట నుంచి కామారెడ్డి వెళ్లే మార్గంలో వరద నీటి దాటికి వంతెన కొట్టుకుపోయింది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు క్యాసంపల్లి శివారులో వరద తీవ్రతకు జాతీయ రహదారి బైపాస్ రోడ్డుపై భారీ గుంతలు ఏర్పడ్డాయి. దీంతో నిజామాబాద్ వైపు వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. క్యాసంపల్లి శివారులో హైవేపై ఏర్పడిన గుంత కారణంగా రోడ్డు ధ్వంసమైంది. మెదక్-బోధన్ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. పోచారం జలాశాయానికి భారీగా వరద పోటెత్తడంతో మెదక్, బోధన్ ప్రధాన రహదారిపై హై లెవల్ వంతెన కొట్టుకుపోయింది. దీంతో ఈ మార్గంలో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. ఇరువైపులా వాహనాలు రాకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు. మరో మార్గం నుంచి వాహనాలు ప్రయాణించే విధంగా అధికారులు ఏర్పాట్లు చేశారు.
గ్రామాలు ఖాలీ
భారీ వర్షాల కారణంగా కామారెడ్డి జిల్లాలోని పలు గ్రామాలను వరద ముంచెత్తుతోంది. ఈక్రమంలో డోంగ్లి మండలంలోని సిర్పూర్, హాసన్ టాక్లి, పెద్దటాక్లి గ్రామాల్లోని ప్రజలు ఇళ్లు ఖాలీ చేసి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. పొరుగు గ్రామాల్లోని తమ బంధువుల ఇళ్లలో తలదాచుకుంటున్నారు. చిన్నారులు, వృద్ధులు మద్నూర్ మండలంలోని మిర్జాపూర్ (సలాబత్ పూర్) ఆంజనేయస్వామి ఆలయంలో తలదాచుకున్నారు. పెద్ద టాక్లీలోని కొన్ని కుటుంబాలు డోంగ్లి మండల కేంద్రానికి వెళ్లాయి. సిర్పూర్‌లో 246, పెద్దటాక్లిలో 190, హాసన్ టాక్లిలో 120 కుటుంబాల వారు తమ ఇళ్లకు తాళాలు వేశారు. పిట్లం మండలం కుర్తి గ్రామం పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకుంది. నియోజక వర్గంలోని నిజాంసాగర్, కౌలాస్ నాలా జలాశయాల గేట్లు ఎత్తి వరద నీటిని దిగువ మంజీరాలోకి విడుదల చేస్తున్నారు. దీంతో ముంపు గ్రామాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. జుక్కల్ ఎమ్మెల్యే తోట లఁ్‌కాంతారావు బాధితులకు పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని అధికారులను కోరారు. ఇళ్లు వదిలి ఆలయాల్లో తలదాచుకున్న వాళ్లతో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
నిండుకుండలా మానేరు జలాశయం
మెదక్, కామారెడ్డి జిల్లాల్లో కురుస్తున్న వర్షాలతో మానేరు వాగు ఉగ్రరూపం దాల్చింది. రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. నర్మాల వద్ద ఎగువ మానేరు జలాశయం నిండుకుండను తలపిస్తోంది. దీంతో దిగువకు వరద నీటిని విడుదల చేశారు. మరోవైపు మిడ్ మానేరులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. మధ్య మానేరు 17 గేట్ల నుంచి 33 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సిరిసిల్ల, కరీంనగర్, ఖమ్మం, సంగారెడ్డి, హనుమకొండ, వరంగల్, పెద్దపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ వెల్లడించింది. సిద్దిపేట, మెదక్, జనగామ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో నేడు, రేపు తెలంగాణలో భారీవర్షాలు కురిసే అవకాశముంది. నేడు ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే వీలుందని వాతావరణశాఖ తెలిపింది. నేడు ఆదిలాబాద్, కుమురం భీం, మంచిర్యాల, కామారెడ్డి, మెదక్, భూపాలపల్లి, ములుగు, హనుమకొండ, వరంగల్, భద్రాద్రి, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని వెల్లడించింది. ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.
ఖమ్మం జిల్లాలో పొంగుతున్న వాగులు
ఖమ్మం జిల్లా కొణిజర్లలో భారీ వర్షం కురిసింది. ఈ ప్రభావంతో పగిడేరు, నిమ్మవాగు, జన్నారం ఏరు, రాళ్లవాగు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. కొణిజర్ల, మల్లుపల్లి మధ్య రోడ్డు పైనుంచి పగిడేరు ప్రవహిస్తుండటంతో కొణిజర్ల, ఏన్కూరు మండలాల రాకపోకలు నిలిచిపోయాయి. కొణిజర్ల, పెద్దమునగాల, పెద్దగోపతి, గుబ్బగుర్తి చెరువులు అలుగు పారుతున్నాయి. వాగుల ఉద్ధృతితో ఆ పరిసర ప్రాంతాల్లోని పంటలు నీట మునిగాయి. తీవ్రంగా నష్టపోయినట్లు- రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొణిజర్ల మండలంలో 120 మిల్లీటర్ల వర్షం కురిసినట్లు అధికారులు వెల్లడించారు.
వరదల్లో చిక్కుకున్న ఐదుగురిని కాపాడిన ఆర్మీ
సిరిసిల్ల జిల్లాలో వరదలో చిక్కుకున్న ఐదుగురిని ఆర్మీ సిబ్బంది రక్షించారు. గంభీరావుపేట మండలం నర్మాల వద్ద ఎగువ మానేరు ప్రాజెక్టుకు అవతలివైపు పశువులను మేపేందుకు బుధవారం ఐదుగురు వ్యక్తులు వెళ్లారు. ఒక్కసారిగా వరద రావడంతో వారంతా అక్కడే చిక్కుకున్నారు. విషయం తెలుసుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ తక్షణమే స్పందించారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో మాట్లాడి రెండు హెలికాప్టర్లను తెప్పించారు. ఈక్రమంలో వరదలో చిక్కుకున్న వారిని గురువారం ఆర్మీ అధికారులు రెండు హెలికాప్టర్ల ద్వారా సురక్షిత ప్రాంతానికి తరలించారు. సహాయక చర్యలను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్, ఎస్పీ పరిశీలించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోల కోసం Prajatantra వెబ్‌సైట్‌ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్‌ను ఫాలో కండి. అలాగే మా ప్రజాతంత్ర యూట్యూబ్ చానల్‌ను సబ్ స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మరిచిపోవద్దు.





