– జల సంచాయ్ జన భాగీదారీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం
– పనుల జాతర, ఉపాధి పనుల్లో వర్షపు నీటి సంరక్షణకు ప్రాధాన్యత
– ఫలితంగా తొలి స్థానంలో తెలంగాణ
– అధికారులకు మంత్రి సీతక్క, సీఎం రేవంత్ అభినందనలు
హైదరాబాద్, సెప్టెంబర్ 25: వర్షపు నీటి సంరక్షణలో దేశానికి ఆదర్శంగా తెలంగాణ నిలిచింది. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ప్రకటించిన జల సంచాయ్ జన భాగీదారీ 1.0 ర్యాంకుల ప్రకారం దేశవ్యాప్తంగా వర్షపు నీటి సంరక్షణ పనుల్లో తెలంగాణ మొదటి స్థానాన్ని సాధించింది. చత్తీస్‌గఢ్, రాజస్థాన్ వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. 2024-25లో రాష్ట్రవ్యాప్తంగా 5,20,362 వర్షపు నీటి సంరక్షణ పనులు చేపట్టిన తెలంగాణ ఈ రంగంలో దేశంలోనే అత్యధిక పనులు నిర్వహించిన రాష్ట్రంగా నిలిచింది. చెక్‌డ్యామ్‌లు, ఇంకుడు గుంతలు, రూఫ్ వాటర్ హార్వెస్టింగ్ వంటి అనేక పనులను చేపట్టి విజయవంతంగా పూర్తిచేసింది. ఉత్తరప్రదేశ్, బీహార్ వంటి పెద్ద రాష్ట్రాలు సైతం చేయలేకపోయిన పనులను ప్రజల భాగస్వామ్యంతో తెలంగాణ చేసి చూపించింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో వివిధ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు, వ్యక్తుల సహకారంతో చేపట్టిన ఈ ఉద్యమానికి ముఖ్యమంత్రి మార్గనిర్దేశనం, మంత్రి సీతక్క ప్రత్యేక పర్యవేక్షణ ప్రధాన బలంగా నిలిచాయి. ప్రజా ప్రభుత్వం చేపట్టిన పనుల జాతర, ఉపాధి హామీ పనుల్లోనూ నీటి సంరక్షణకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. దేశవ్యాప్తంగా 67 జిల్లాలు ఎంపికవ్వగా తెలంగాణకు చెందిన 8 జిల్లాలకు ప్రత్యేక గుర్తింపు లభించింది. రూ.2 కోట్ల రివార్డు విభాగంలో ఎంపికైన మూడు జిల్లాలు, రూ.కోటి రివార్డులో ఎంపికైన మూడు జిల్లాలు, రూ.25 లక్షల రివార్డు విభాగంలో ఎంపికైన 13 జిల్లాల్లో 2 జిల్లాలు తెలంగాణకు చెందినవే కావడం విశేషం. ఆదిలాబాద్, నల్గొండ, మంచిర్యాల ఒక్కో జిల్లాకు రూ.2 కోట్లు వరంగల్, నిర్మల్, జనగాం %-% ఒక్కో జిల్లాకు రూ. కోటి, భద్రాద్రి, మహబూబ్‌నగర్ ఒక్కో జిల్లాకు రూ.25 లక్షలు రివార్డును కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ప్రకటించింది. వర్షపు నీటి సంరక్షణలో దేశంలోనే తొలి స్థానం సాధించి దేశానికి ఆదర్శంగా తెలంగాణ నిలవడం పట్ల పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క హర్షం వ్యక్తం చేశారు. ఈ ఘనత సాధించడంలో కీలక పాత్ర పోషించిన ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్.శ్రీధర్, డైరెక్టర్ జీ.సృజన, జిల్లా కలెక్టర్లు, శాఖ అధికారులను అభినందించారు. భూగర్భ జలాల పెంపుదల, వర్షపు నీటి సమర్థ వినియోగం, ప్రజల భాగస్వామ్యం అనే మూడు ప్రధాన లక్ష్యాలతో సాగిన ఈ ఉద్యమం దేశానికి తెలంగాణ ఇచ్చిన మరో గొప్ప సందేశంగా నిలుస్తుందని ఆమె పేర్కొన్నారు. కాగా అవార్డులు రావడంపట్ల ముఖ్యమంత్రి ఆయా జిల్లాల అధికారులను అభినందిస్తూ వీరు ఇతర అధికారులకు స్ఫూర్తిదాయకం కాగలరని ఆశాభావం వ్యక్తం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





