– కూకట్‌పల్లిలో భారీగా ట్రాఫిక్ జామ్
– ప్రభుత్వం అప్రమత్తం
– వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద ప్రత్యేక సిబ్బంది ఏర్పాటు
– అధికారులతో సమీక్షించిన మంత్రి పొన్నం
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 23 : రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్‌లో భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్, కలెక్టర్ దాసరి హరిచందన, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి.కర్ణన్, హైడ్రా కమిషనర్ రంగనాథ్, మెట్రో వాటర్ వర్క్స్, ట్రాఫిక్ అధికారులతో మంత్రి సమీక్షించారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని, హైదరాబాద్‌లోని 141 వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్డీఆర్‌ఎఫ్ బృందాలు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గత వారం కురిసిన వర్షాలకు నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తాయని, మరోసారి అలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతో మంత్రి పొన్నం అప్రమత్తమయ్యారు. నగరంలో ఎక్కడా ఇబ్బంది లేకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. కాగా, భాగ్యనగరానికి వాతావరణ శాఖ భారీ వర్షసూచన చేసింది. భారీ వర్షం నేపథ్యంలో ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ కల్పించాలని సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు దిశానిర్దేశం చేశారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా సహకరించాలని ఐటీ కంపెనీలను కోరారు. మరోవైపు హుస్సేన్‌సాగర్‌కు భారీగా వరద పోటెత్తింది. ఎగువ ప్రాంతాల నుంచి ట్యాంక్‌బండ్‌కు భారీగా వరద చేరుకుంది. జీడిమెట్ల, కూకట్‌పల్లి, పికెట్ నాలాల నుంచి హుస్సేన్‌సాగర్‌కు వరద ప్రవాహం ఎక్కువగా ఉంది. ప్రస్తుత నీటిమట్టం 513.34 మీటర్లుగా ఉంది. ఫుల్ ట్యాంక్ లెవెల్ చేరువలోకి హుస్సేన్‌సాగర్ చేరుకోగా తూముల ద్వారా నీటిని వదులుతున్నారు. మూసీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను జీహెచ్‌ఎంసీ అప్రమత్తం చేసింది. ఇదిలావుంటే హైదరాబాద్‌లో ఉదయం నుంచి ముసురు వానతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. కూకట్‌పల్లిలో ముస్లిం గ్రేవ్ యార్డ్ వద్ద రోడ్డు కొట్టుకుపోయి మ్యాన్‌హోల్ బయటకు తేలడంతో ట్రాఫిక్ జామ్ ఏర్పడిరది. వై జంక్షన్ నుంచి కూకట్‌పల్లిలోని బీజేపీ కార్యాలయం వరకు వాహనాలు నిలిచిపోయాయి. ఓ అంబులెన్సు ట్రాఫిక్‌లో చిక్కుకుంది. భరత్‌నగర్ వంతెనపైనా ట్రాఫిక్ నిలిచిపోయి వాహనదారులు ఇబ్బందిపడ్డారు.





