– పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం
– హైదరాబాద్‌లో పలుచోట్ల మోస్తరు వర్షం
హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 23: బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో భాగ్యనగరంలో పలుచోట్ల వర్షం కురిసింది. సోమవారం మధ్యాహ్నం వరకు భానుడు తన ప్రతాపం చూపినప్పటికీ మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఆకాశం మబ్బుపట్టి చల్లని గాలులు వీచడంతో నగరంలో ఆహ్లాదకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. చాలా రోజుల తర్వాత కురిసిన చిరు జల్లులు భాగ్యనగరాన్ని మురిపించాయి. ఇప్పుడిప్పుడే ఎండలు ముదురుతున్న తరుణంలో నగర ప్రజలను వరుణుడు పలకరించాడు. ఆకాశం మేఘావృతం కాగా.. ఖైరతాబాద్, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్ రోడ్, కాచిగూడ సహా పలుచోట్ల చిరు జల్లులు కురుస్తున్నాయి. మరోవైపు మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా మారింది. ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తోంది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావం వల్లే వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా అబిడ్స్, బషీర్ బాగ్, సైఫాబాద్, ట్యాంక్ బండ్, సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసింది. అలాగే మీర్‌పేట్, బడంగ్‌పేట్ ప్రాంతాల్లోనూ వాన పడింది. ఎల్బీ నగర్, మలక్‌పేట్, సరూర్ నగర్, చార్మినార్, బీఎన్ రెడ్డి, ఉప్పల్, నాగోల్, అంబర్‌పేట్, వనస్థలిపురం, హయత్‌నగర్ వంటి ప్రాంతాల్లో బలంగా ఈదురు గాలులు వీచాయి. వికారాబాద్ ప్రాంతంలో వీస్తున్న భారీ ఈదురు గాలులు ప్రస్తుతం హైదరాబాద్ దిశగా వేగంగా కదులుతున్నాయి. ఈ ప్రభావంతో సాయంత్రం 6 గంటల తర్వాత గచ్చిబౌలి, రాజేంద్ర నగర్, లింగంపల్లి పరిసర ప్రాంతాల్లో బలమైన గాలులతో కూడిన చిరు జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. నగరంలో వాతావరణం చల్లబడితే జిల్లాల్లో మాత్రం ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి.. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాళేశ్వరంలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం పడింది. గాలుల ధాటికి పలుచోట్ల చెట్లు విరిగిపడటంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్ల వాన కురిసింది. భారీ గాలులకు షాపుల బోర్డులు, ప్లెక్సీలు ఎగిరిపోయాయి. కొన్ని రేకుల ఇళ్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. రోడ్లన్నీ జలమయం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





