రైల్వే లాండ్రీ టెండర్‌లో బిడ్‌ తిరస్కరణపై పిటిషన్‌

  • ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 5 : రైల్వే లాండ్రీ ప్రాజెక్టుకు సంబంధించిన రూ. 434 కోట్ల విలువైన టెండర్‌లో ఒక బిడ్డర్‌ను సాంకేతిక కారణాలతో తిరస్కరించిన కేంద్ర ప్రభుత్వ చర్యపై విచారణ అవసరమని హైకోర్టు అభిప్రాయపడింది. భారత రైల్వేలతో బూట్‌ మోడల్‌లో వాణిజ్య లాండ్రీ సేవలను పిటిషనర్‌ సంస్థ అందిస్తోంది. 2025 మే 15న విడుదలైన టెండర్‌కు పిటిషనర్‌ సంస్థ బిడ్లు సమర్పించింది. అయితే,సుప్రీం లాండ్రీ సర్వీసెస్‌ జాయింట్‌ వెంచర్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థకు చెందిన పత్రాలు పిటిషనర్‌ సంస్థ ఏఎస్‌జీ సుప్రీం లాండ్రీ సర్వీసెస్, సమర్పించలేదని చెప్పి అధికారులు గత జూలై 26న బిడ్‌ను తిరస్కరించారు. వాటిని సాంకేతిక కారణాల వల్ల అప్‌లోడ్‌ చేయలేకపోయామని పిటిషనర్‌ న్యాయవాది ఎ.వెంకటేశ్‌ వాదించారు. తిరస్కరించిన తర్వాత రోజు పత్రాలను సమర్పించినట్లు వివరించారు. టెండర్‌లో తమ బిడ్‌ తక్కువ ధరకు కోట్‌ చేశామని, అయినప్పటికీ పిటిషనర్‌ బిడ్‌ను అన్యాయంగా తిరస్కరించారని చెప్పారు. దీనిపై కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ బి.నర్సింహశర్మ ప్రతివాదన చేస్తూ, గడువు ముగిసిన తర్వాత పత్రాలు సమర్పించినట్లు పిటిషనరే అంగీకరిస్తున్నారని, పిటిషన్‌ను కొట్టేయాలని కోరారు. వాదనలపై స్పందించిన హైకోర్టు, టెండర్‌ ప్రక్రియలో సందిగ్ధత నెలకొంటే కోర్టులు జోక్యం చేసుకోవాలని టాటా మోటార్స్‌ కేసులో సుప్రీం కోర్టు చెప్పిందని గుర్తు చేసింది. టెండర్‌ను ఇంకా ఖరారు చేయలేదని కూడా గుర్తు చేసింది. ఈ నెల 18న సమగ్ర విచారణ చేస్తామని జస్టిస్‌ ఎన్‌.వి.శ్రవణ్‌ కుమార్‌ ప్రకటించారు.

అత్తమామలపై దాఖలైన కేసు రద్దు 

అత్తమామలపై దాఖలైన కేసు రద్దు హైకోర్టు రద్దు చేస్తూ జస్టిస్‌ జువ్వడి శ్రీదేవి ఇటీవల తీర్పు వెలువరించారు. ఐపీసీలోని 498–ఎ వరకట్న నిషేధ చట్టంలోని 3, 4 సెక్షన్ల కింద నమోదైన కేసుల్లోని ఆరోపణలకు స్పష్టత లేదని, సాదాసీదా ఆరోపణలతో కేసు పెట్టారని తప్పుపట్టారు. నిర్ధిష్ట ఆధారాలు లేకుండా కేసు పెట్టారని ఆక్షేపించారు. మహారాష్ట్రకు చెందిన గోవింద్‌ ప్రసాద్‌ శర్మ, ఉష శర్మ వృద్ధ దంపతు శర్మ కుమారుడు మహేశ్‌కు 2017లో వివాహం జరిగింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ అత్తాపూర్‌లో ఉండే కోడలు అత్తమామలపై 2022లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. వేధిస్తున్నారంటూ 498–ఎ కింద కేసు నమోదు అయ్యింది. మహారాష్ట్రలోని ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం ప్రయత్నం చేస్తూనే అత్తమామలు రూ.10 లక్షలు అదనపు కట్నం ఇవ్వాలని వేధిస్తున్నారని కేసు పెట్టారని, అయితే, అత్తమామలు దౌర్జన్యం చేశారని బాధితురాలు ఆరోపించారేగానీ, ఏతేదీన, ఎక్కడ దౌర్జన్యానికి పాల్పడిందీ వివరించలేదని న్యాయమూర్తి తప్పుపట్టారు. కుటుంబసభ్యులపై నిరాధార ఆరోపణలు చేసి తప్పుడు కేసులు నమోదు వల్ల చట్టం దుర్వినియోగం అవుతోందని వ్యాఖ్యానించారు. సుప్రీం కోర్టు భజన్‌లాల్‌ కేసులో జారీ చేసిన మార్గదర్శకాలను ప్రస్తావిస్తూ, వ్యక్తిగత ప్రతీకారంతో అత్తమామలపై కేసు పెట్టినట్లుగా ఉందన్నారు. అత్తమామలపై క్రిమినల్‌ కేసును రద్దు చేస్తూ తీర్పు వెలువరించారు.

యాంత్రికంగా రిమాండ్‌ ఉత్తర్వులు

కింది కోర్టు ఆదేశాలను తప్పుపట్టిన హైకోర్టు

నిందితుడిని పోలీసులు అరెస్టు చేసిన 24 గంటల వ్యవధిలోగా కోర్టులో హాజరుపర్చలేదని, ఈ విషయాన్ని పట్టించుకోకుండా కింది కోర్టు యాంత్రికంగా రిమాండ్‌ ఉత్తర్వులను జారీ చేసిందని హైకోర్టు తప్పుపట్టింది. రిమాండ్‌ ఆదేశాలు చట్టవిరుద్ధమని జస్టిస్‌ ఎన్‌. తుకారాం జీ స్పష్టం చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. హైదరాబాద్, ఈడీ బజార్‌కు చెందిన సయ్యద్‌ దస్తగిరి చదువుతూ క్యాబ్‌ డ్రైవర్‌గా చేస్తున్నాడు. అతనిపై మలక్‌పేట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు సయ్యద్‌ దస్తగిరిని గత నెల జూలై 7న రాత్రి 10:15 గంటలకు అరెస్ట్‌ చేశారు. ఆ తర్వాత రోజు రాత్రి 11:35 గంటలకు అతనిని మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిచారు. అంటే, 24 గంటల గడువు ముగిసిన తర్వాత కోర్టులో హాజరుపరిచారని న్యాయమూర్తి తప్పుపట్టారు. ఈ జాప్యాన్ని గమనించకుండా మేజిస్ట్రేట్‌ చట్ట వ్యతిరేకంగా రిమాండ్‌ ఆదేశాలు ఇచ్చారని ఆక్షేపించారు. నిందితుడిపై బీఎన్‌ఎస్‌ఎస్‌ సెక్షన్‌ 318(4), 204 రెడ్‌ విత్‌ 3(5) నమోదు చేసినవి నిరూపణ అయితే ఏడేళ్లలోపు శిక్ష పడేవేనని, 35(3) కింద నోటీసు ఇచ్చి ఉండాల్సిందని అన్నారు. అర్నేష్‌ కుమార్‌ – బీహార్‌ మధ్య జరిగిన కేసులో సుప్రీం కోర్టు గైడ్‌లైన్స్‌ను పోలీసులు అమలు చేయలేదన్నారు. ఈ ఉత్తర్వులను అందుకున్న వెంటనే నిందితుడిని హైదరాబాద్‌ ఏడో అదనపు చీఫ్‌ మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపరిచి విడుదల చేయాలని ఆదేశించారు. నిందితుడి నుంచి వారం రోజుల్లోగా రూ.10 వేల వ్యక్తిగత బాండ్‌లను రెండు ఘ్యారిటీలు తీసుకోవాలని, కేసు దర్యాప్తునకు పిటిషనర్‌ సహకరించాలని తీర్పులో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *