– రిజర్వేషన్లపై పభుత్వం ఆర్డినెన్స్ తెస్తామన్నందుకే
– ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 11: బీసీ రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ తీసుకొస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఈనెల 17న చేపట్టనున్న రైల్‌రోకో కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్లు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రకటించారు. మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఆర్డినెన్స్ తీసుకురావడాన్ని తెలంగాణ బీసీ బిడ్డలు, జాగృతి విజయంగా భావిస్తున్నామన్నారు. ప్రజా ఉద్యమాల ద్వారా ఒత్తిడి తేవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందన్నారు. బీసీ బిల్లును షెడ్యూల్-9లో పెట్టాలి. దీనికోసం బీసీ బిడ్డ, కేంద్ర మంత్రి బండి సంజయ్ చొరవ తీసుకోవాలని కోరారు. ఆర్డినెన్స్ తీసుకొస్తామని చెప్పినందున ఈ వారం రోజులు ప్రభుత్వ కార్యాచరణను గమనిస్తామని, దీనిపై ముందుకెళ్లకపోతే రైల్‌రోకో చేపడతామని కవిత అన్నారు. అంతకుముందు బంజారాహిల్స్‌లోని తన నివాసం నుంచి జాగృతి శ్రేణులతో ర్యాలీగా లోయర్ ట్యాంక్‌బండ్‌కు వెళ్లారు. అక్కడ అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్థానిక ఎన్నికలకు ముందే 42 శాతం బీసీ రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ తీసుకొస్తామని మంత్రి పొంగులేటి చెప్పారని, ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని అన్నారు. కాగా, ఆర్డినెన్స్ ఇచ్చి వెంటనే రిజర్వేషన్లు అమలు చేయగలిగితే అధికారంలోకి వచ్చిన 18 నెలలు ఎందుకు ఆగారని ప్రశ్నించారు. రాజకీయ లబ్ధి కోసమే అలా చేశారని తాము భావిస్తున్నామన్నారు.




