– వాటికి షెల్టర్లు ఏర్పాటు చేసి స్టెరిలైజేషన్ చేయాలి
– కాంగ్రెస్ ఎంపి రాహుల్ గాంధీ అభిప్రాయం
– పునః పరిశీలించాలన్న నటుడుఅడవి శేష్
న్యూదిల్లీ, ఆగస్ట్ 12: దిల్లీ, ఎన్సీఆర్‌లలో వీధి కుక్కలను షెల్టర్లకు తరలించాలని సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భిన్నంగా స్పందించారు. రోజు రోజుకు మనం సైన్స్, మానవత్వం లేని ప్రాచీన యుగంలోకి వెళ్లిపోతున్నట్లుగా ఉందన్నారు. మూగజీవాలైన కుక్కలు సమాజంలో పెద్ద సమస్య కాదని.. వాటిని పూర్తిగా నిర్మూలించడం సరైన చర్య కాదని అన్నారు. కుక్కల నుంచి ప్రజలకు భద్రత కల్పించాలనుకుంటే వాటికి స్థానికంగా షెల్టర్ల ఏర్పాటు, స్టెరిలైజేషన్, టీకాలు వేయడం వంటి చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. వీధి కుక్కల అంశంలో ‘సుప్రీమ్’ ఇచ్చిన ఆదేశాలను పునఃపరిశీలించాలని అభ్యర్థిస్తూ సినీ నటుడు అడివి శేష్ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గవాయ్‌కు లేఖ రాశారు. ఈ విషయంలో దిల్లీ సీఎం రేఖా గుప్తాకు కూడా లేఖ రాసినట్లు ఆయన వెల్లడించారు. తీర్పుపై ఇప్పటికే పలు జంతు హక్కుల సంస్థలు ఆక్షేపణ తెలిపాయి. కేంద్ర మాజీమంత్రి, జంతు హక్కుల కార్యకర్త మేనకా గాంధీ సైతం ఈ విషయాన్ని లేవనెత్తారు. ఈ తీర్పు ఆచరణ సాధ్యం కాదన్నారు. దిల్లీలో 3 లక్షల వీధి కుక్కలున్నాయి. వీటికోసం 3 వేల షెల్టర్లు కావాలి. వీటి ఏర్పాటుకు రూ.15 వేల కోట్లు ఖర్చు చేసే పరిస్థితిలో దిల్లీ ప్రభుత్వం ఉందా? అని ప్రశ్నించారు. దిల్లీ వీధుల్లో కుక్కల బెడద, కుక్కకాటు, రేబిస్ వంటి కారణాల వల్ల మరణాలు పెరుగుతుండటం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తూ.. కుక్కలను దూరంగా ఉన్న షెల్టర్లకు తరలించాలని సోమవారం సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీనిపై కేంద్ర ప్రభుత్వ వాదనలు మాత్రమే వింటామని.. తమ ఆదేశాలకు వ్యతిరేకంగా జంతు ప్రేమికులు, ఇతర పార్టీలు, సంస్థలు వేసిన పిటిషన్లను విచారించబోమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ప్రజాప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ ఆదేశాలు జారీ చేశామని ధర్మాసనం పేర్కొంది. వీలైనంత త్వరగా దిల్లీలోని అన్ని ప్రాంతాల నుంచి కుక్కలను దూర ప్రాంతాలకు తరలించాలని అధికారులను అదేశించింది.





