సైన్యం చేతులు కట్టేసి పాక్‌తో సయోధ్య

– ఉగ్రదాడులకు దీటుగా సమాధానం చెప్పడంలో విఫలం
– దమ్ముంటే ట్రంప్‌ ‌వ్యాఖ్యలను ఖండించాలి
– ఆపరేషన్‌ ‌సిందూర్‌ ‌చర్చపై ప్రతిపక్ష నేత రాహుల్‌ ‌గాంధీ

న్యూదిల్లీ,జూలై29: ఆపరేషన్‌ ‌సిందూర్‌ ‌సమయంలో మన సైనికుల చేతులు కట్టేశారని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ ‌గాంధీ ఆరోపించారు. సాయుధ దళాలకు మద్దతుగా నిలిచే విషయంలో ప్రభుత్వానికి రాజకీయ సంకల్పం కొరవడిందని విమర్శించారు. తాము యుద్ధం కోరుకోవడం లేదని పాకిస్థాన్‌కు భారత ప్రభుత్వమే తెలియజేసిందన్నారు. ‘ఆపరేషన్‌ ‌సిందూర్‌ ’‌పై చర్చ సందర్భంగా లోక్‌సభలో రాహుల్‌ ‌ప్రసంగిస్తూ.. పహల్గాం ఉగ్రదాడిని పాకిస్థాన్‌ ‌కుట్రపన్నిన క్రూరమైన ఘటనగా పేర్కొన్నారు. సాయుధ దళాలను ఉపయోగించాలనుకుంటే.. బలమైన రాజకీయ సంకల్పం ఉండాలి. వారికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలి. కానీ.. ఆపరేషన్‌ ‌సిందూర్‌ ‌విషయంలో మన సైనికుల చేతులు కట్టేశారు. ఈ ఆపరేషన్‌కు సంబంధించిన సున్నితమైన వివరాలను దాయాదికి వెల్లడించారు. అర్ధరాత్రి 1.05 గంటలకు ఆపరేషన్‌ ‌ప్రారంభమైందని.. 1.35కు పాకిస్థాన్‌కు ఫోన్‌ ‌చేసి సైనికేతర లక్ష్యాలను ఛేదించామని రాజ్‌నాథ్‌ ‌సింగ్‌ ‌తెలిపారన్నారు. ఉద్రిక్తతలు పెంచే ఆలోచన లేదని దాయాదితో చెప్పామన్నారు. అంటే.. పాక్‌తో యుద్ధం చేసే ఆలోచన లేదని ఆయన చెప్పకనే చెప్పారని రాహుల్‌ ‌గాంధీ విమర్శించారు.
పాక్‌ ‌విజ్ఞప్తి మేరకు యుద్ధాన్ని ఆపామని ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు.. భారత్‌-‌పాక్‌ ‌యుద్ధాన్ని తానే ఆపానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఇప్పటివరకు 29 సార్లు చెప్పుకొన్నారు.  ఇందిరా గాంధీలా ధైర్యం ఉంటే.. ట్రంప్‌ ‘అబద్ధాలకోరు’ అని, భారత్‌ ‌యుద్ధవిమానాలకు ఎటువంటి నష్టం వాటిల్లలేదని ప్రధాని మోదీ లోక్‌సభలో ప్రకటించాలని రాహుల్‌ ‌డిమాండ్‌ ‌చేశారు. ‘ఆపరేషన్‌ ‌సిందూర్‌’‌కు ముందు అన్ని పార్టీలు ఏకతాటిపై నిలిచాయని, తాను పహల్గాం దాడి బాధిత కుటుంబాలను పరామర్శించినట్లు తెలిపారు. పహల్గాం ఉగ్రదాడి అమానుషమని, ఈ దాడి అనంతరం చేపట్టిన ఆపరేషన్‌ ‌సిందూర్‌కు ప్రతిపక్షాలు ముక్తకంఠంతో ప్రభుత్వానికి మద్దుతు తెలిపాయని, ఇందుకు తాము గర్విస్తున్నామని రాహుల్‌ ‌గాంధీ అన్నారు.హహల్గాం ఉగ్రదాడిలో పర్యాటకులను అత్యంత కిరాతకంగా కాల్చి చంపారని రాహుల్‌ అన్నారు. ఉగ్రదాడిలో పిల్లలు, యువకులు, వృద్ధులు చనిపోయారని, భార్య కళ్ల ముందే భర్తను కాల్చి చంపేశారని ఆవేదన వ్యక్తం చేసారు. విపక్షాలుగా దేశ భద్రత విషయంలో తాము ప్రభుత్వానికి అండగా నిలిచామని, ఆపరేషన్‌ ‌సిందూర్‌కు ముక్తకంఠంతో మద్దతు తెలిపామని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *