సభలో నన్ను మాట్లాడనీయడం లేదు

లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌గాంధీ

దిల్లీ, జులై 21: పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన తొలిరోజు లోక్‌సభలో విపక్ష నేత, కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌గాంధీ అధికార పక్షంపై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు. సభలో విపక్షాలు ప్రస్తావించదలచిన అంశాలపై మాట్లాడేందుకు తనను అనుమతించడం లేదని విమర్శించారు. కేంద్ర మంత్రులను మాట్లాడేందుకు అనుమితిస్తూ విపక్ష నేతగా ఉన్న తనను అనుమతించకపోవడం ఏమిటని ప్రశ్నించారు. పహల్గాం ఉగ్రదాడి, బీహార్‌లో ఓటర్ల జాబితా సవరణ సహా ఎనిమిది అంశాలను ప్రతిపక్ష పార్టీలు ప్రస్తావించాలని తలంచాయి. తమ డిమాండ్లపై ఆ పార్టీలు లోక్‌సభలో నినాదాలు చేయడంతో తొలుత మధ్యాహ్నం 12 గంటల వరకు, ఆ తర్వాత 2 గంటల వరకూ సభ వాయిదా పడిరది. ‘సభలో రక్షణ మంత్రిని మాట్లాడేందుకు అనుమతించారు.. కానీ విపక్ష నాయకుడిగా ఉన్న నాతో సహా ప్రతిపక్ష సభ్యులను అనుమతించలేదు.. ఇదో కొత్త తరహా పద్ధతి.. ప్రభుత్వం వైపు ఉన్న వాళ్లను మాట్లాడేందుకు అనుమతించినప్పుడు మాకు కూడా మాట్లాడే అవకాశం ఇవ్వడమే సంప్రదాయం’ అని రాహుల్‌ పేర్కొన్నారు. ఆపరేషన్‌ సిందూర్‌పై చర్చించేందుకు సిద్ధమేనని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు చెప్పడాన్ని కాంగ్రెస్‌ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా ప్రస్తావిస్తూ వాళ్లు చర్చించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు విపక్ష నేతను కూడా మాట్లాడనీయాలని, ఆయన మాట్లాడేందుకు లేచినప్పుడు అనుతించాల్సి ఉంటుందని అన్నారు. విపక్షాల ఆందోళన మధ్య రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ మాట్లాడుతూ ఏ అంశంపైనైనా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. కిరణ్‌ రిజిజు మరింత వివరణ ఇస్తూ మధ్యాహ్నం 2.30 గంటలకు బిజినెస్‌ అడ్వయిజరీ కమిటీ సమావేశం ఉందని, ప్రభుత్వం చర్చించడానికి సిద్ధంగా ఉంటే విపక్ష ఎంపీలు సభలో నిరసన తెలుపుతున్నారని, సమావేశాల తొలిరోజే ఇలా చేయడం సరికాదని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *