లోక్‌స‌భ‌లో రాహుల్- రాజ్‌నాథ్‌ మధ్య తీవ్ర వాగ్వాదం

– చైనా అంశంపై రాహుల్ వ్యాఖ్యలు.. సభలో రచ్చ
– ప్రచురణ కాని పుస్తకాన్ని ప్రస్తావించడంపై రాజ్‌నాథ్‌ అభ్యంతరం
– నరవాణే వ్యాఖ్యలతో లోక్‌స‌భ‌లో ఉద్రిక్తత
– జాతీయ భద్రత అంశంపై పార్లమెంట్‌లో హాట్ డిబేట్

న్యూదిల్లీ, ఫిబ్రవరి 2 : మాజీ ఆర్మీ చీఫ్ ఎంఎం నరవాణే తన పుస్తకంలో రాసు కున్న వ్యాఖ్యలను రాహుల్ గాంధీ పార్లమెంట్‌లో ప్రస్తావించారు. దీంతో లోక్ సభలో రగడ నెలకొన్నది. ప్రచురణ కాని పుస్తకం నుంచి రాహుల్ వ్యాఖ్యలు చేస్తున్నారని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అన్నారు. రాహుల్ గాంధీ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. కేంద్ర బడ్ట్‌పై జరుగుతున్న చర్చలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ మాట్లాడారు. చైనా అంశంపై మాజీ ఆర్మీ చీఫ్ నరవాణే తన పుస్తకంలో రాసుకున్న వ్యాఖ్యలను రాహుల్ ప్రస్తావించారు. ఓ మ్యాగజైన్ లో ప్రచురించిన పేజీలను ఆయన సభలో చూపించారు. తన వాదనను నిజం చేసే రీతిలో ఆ ప్రస్తావన ఉన్నట్లు రాహుల్ పేర్కొన్నారు. ఆ వ్యాఖ్యలను అధికారపక్షం వ్యతిరేకించింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్, హోంశాఖ మంత్రి అమిత్ షా జోక్యం చేసుకుని.. ఇంతకీ రాహుల్ చెప్పున్న ఆ బుక్ పబ్లిష్ అయ్యిందా లేదా అని ప్రశ్నించారు. హౌజ్ రూల్స్  రాహుల్ గాంధీ ఉల్లంఘించినట్లు రాజ్‌నాథ్‌సింగ్ ఆరోపించారు. ప్రచరణ జరగని పుస్తకాన్ని ఉద్దేశిస్తూ ఎలా వ్యాఖ్యానిస్తారని ఆయన ప్రశ్నించారు. ఆ పుస్తకంలో ఎంత వాస్తవం ఉందో ఎలా తెలుస్తుందని ఆయన అన్నారు. ఆ సమయం లో రాహుల్, రాజ్‌నాథ్‌సింగ్ మధ్య వాగ్వాదం జరిగింది. చాలా విశ్వసనీయ సమాచారాన్ని తాను ప్రస్తావిస్తున్నట్లు రాహుల్ తెలిపారు. అయితే ఏ పుస్తకం నుంచి ఆ వ్యాఖ్య లను తీసుకున్నారో.. ఆ పుస్తకాన్ని సభలో ప్రవేశపెట్టాలని రాజ్‌నాథ్‌సింగ్ డిమాండ్‌ చేశారు. రాహుల్ గాంధీకి అండగా అఖిలేశ్ యాదవ్ మాట్లాడారు. చైనా అంశంపై చర్చించేందుకు రాహుల్ కు అవకాశం ఇవ్వాలని కోరారు. చైనా అంశం చాలా సున్నితమైందని, సభలో ఆ అంశంపై సీరియస్ గా చర్చ జరగా లని అన్నారు. జాతీయ భద్రత, విదేశీ విధానంపై ఆందోళన వ్యక్తం చేస్తున్న సమయంలో లోక్ సభ ప్రతిపక్ష నేతను అడ్డుకోరాదన్నారు. సభా వ్యవహారాలు సాగుతున్న సమయంలో మ్యాగజైన్ లేదా వార్తాపత్రికల ఆర్టికల్స్‌ను సభ్యులు ప్రస్తావించరాదని పార్లమెంటరీ వ్యవహా రాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. అయితే ఇండో-చైనా సంబంధాలపై మాట్లాడే హక్కు తనకు ఉందని, ఏ నిబంధనలు తనను అడ్డుకోలేవని రాహుల్ అన్నారు. చైనాతో సంబంధాలపై మాట్లాడేందుకు ఏం రూల్స్ అడ్డు ఉన్నాయో చెప్పాలని రాహుల్ స్పీకర్ ను కోరారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *