ప్రజాభవన్‌లో పారిశుద్ధ్య కార్మికులతో కలిసి కేక్ కట్ చేసిన ఉప ముఖ్యమంత్రి
వసహపంక్తి భోజనాలు
రాహుల్ గాంధీని ఆశీర్వదించిన కార్మికులు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 19: మహాత్మాజ్యోతి రావు ఫూలే ప్రజాభవన్‌లో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ఖైరతాబాద్ జోన్‌కు చెందిన జీహెచ్‌ఎంసీ పారిశుధ్య కార్మికులతో కలిసి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, టీపీసీసీ సీనియర్ నాయకుడు డాక్టర్ పి.వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా రూపొందించిన కేక్‌ను పారిశుద్ధ్య కార్మికులతో కలిసి కట్ చేయడం విశేషం. అనంతరం కేక్‌ను పారిశుద్ధ్య కార్మికులు మంజుల, కళావతిలకు స్వయంగా తినిపించారు. వారు కూడా ఉప ముఖ్యమంత్రికి కేక్‌ను అందించారు. అనంతరం కార్మికులతో కలిసి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సహపంక్తి భోజనాలు చేశారు.
కార్మికులంతా రాహుల్ గాంధీకి ఆశీర్వాదాలు తెలిపారు. నానమ్మ ఇందిరా గాంధీ, తండ్రి రాజీవ్ గాంధీలా దేశానికి ప్రధానిగా సేవలు అందించాలని ఆకాంక్షించారు.





