– కర్నాటకలో చీటింగ్ ఆధారం తమవద్ద ఉంది
– మీడియాతో విపక్ష నేత రాహుల్ గాంధీ
న్యూదిల్లీ, జూలై24: రాజ్యాంగబద్ద సంస్థ అయిన ఎలక్షన్ కమిషన్ (ఈసీ) స్వతంత్రంగా తన పని తాను చేయడం లేదని కేంద్ర ఎన్నికల సంఘంపై కాంగ్రెస్ అగ్రనాయకుడు, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. పార్లమెంట్ ఆవరణలో రాహుల్ గురువారం మీడియాతో మాట్లాడుతూ కర్ణాటకలోని ఒక నియోజకవర్గంలో ఈసీ చీటింగ్ చేసిందని, ఇందుకు సంబంధించిన 100 శాతం ఆధారం తమ పార్టీ వద్ద ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్నాటకలో మేం ఒక నియోజకవర్గాన్ని పరిశీలించగా వేల సంఖ్యలో అర్హత లేని కొత్త వోటర్లను ఈసీ జాబితాలో చేర్చినట్లు గుర్తించామని తెలిపారు. కొన్ని నియోజకవర్గాల్లో కొత్త వోటర్లు 45, 50, 60, 65 వేల మంది వరకు ఉంటున్నారని అనుమానం వ్యక్తం చేశారు. బీహార్‌లో కూడా ఇప్పుడు ఇదేవిధమైన మోసానికి ఈసీ పాల్పడుతోందని ఆరోపించారు. ఎన్నికల సంఘానికి ఒక్కటే చెప్పాలనుకుంటున్నానని, ఈ తప్పుల నుంచి మీరు తప్పించుకోలేరని, ఒకవేళ తప్పించుకుందామనుకుంటే అది పొరపాటే అవుతుందని, తప్పు చేసిన ఏ ఒక్క అధికారినీ వదలిపెట్టమని హెచ్చరించారు. బీహార్‌లో ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పక్రియ గురించి మీడియా ప్రశ్నించగా పైవిధంగా రాహుల్ స్పందించారు. రాహుల్ గాంధీ ఆరోపణలపై ఈసీ రియాక్ట్ అయింది. నిరాధారమైన ఆరోపణలు చేయొద్దని సూచించింది. ఎన్నికల పిటిషన్లపై న్యాయస్థానాల్లో తీర్పు వచ్చే వరకు వేచి చూడాలని చెప్పింది.




