– రైతుల సొమ్ముతో అమలు చేస్తున్న రేవంత్‌రెడ్డి
– అందుకే నాలుగుసార్లు రైతుబంధు ఎగ్గొట్టారు
– సీటును కాపాడుకుంటున్న సీఎం
– ఆరు గ్యారంటీలపై అసెంబ్లీలో నిలదీస్తాం
– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 9: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాహుల్ బంధు అనే కొత్త పథకాన్ని ప్రవేశపెట్టినట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఈ రాహుల్ బంధు పథకాన్ని రైతులకు ఇచ్చే రైతు బంధు నిధులతో మొదలుపెట్టాడని, ఏడాదికి రూ.1000 కోట్లు రాహుల్ కి ఇచ్చే రాహుల్ బంధు పథకం మాత్రం పక్కాగా అమలు చేస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. రాహుల్ కుటుంబానికి ఎప్పుడు ఇబ్బంది అయినా రూ.వేల కోట్లు పంపించేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడన్నారు. సిరిసిల్లలో సోమవారం జరిగిన నూతన కౌన్సిలర్ల ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడారు. రాష్ట్రంలోని రైతన్నలంతా తమకు రైతు బంధు వస్తుందని, కాంగ్రెస్ పార్టీ పెంచి ఇస్తామన్న నిధులను ఇస్తుందని ఎదురు చూస్తూ ఉంటే రేవంత్ రెడ్డి రైతు బంధును ఎగగొడుతున్నాడన్నారు. ఇప్పటికే మూడుసార్లు రైతు బంధును ఎగగొట్టిన రేవంత్ రెడ్డి ఈసారి కూడా ఎగగొట్టాడని మండిపడ్డారు. రాహుల్ బంధు పథకం ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సీటును కాపాడుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. రేవంత్ రెడ్డి సామంతు రాజు లెక్క రాహుల్ గాంధీకి చెల్లించాల్సిన కప్పం కోసం పేదల భూములు గుంజుకొని,పేదల ఇల్లు కూలగొట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ మొదలుకొని ఖమ్మం దాకా అన్నిచోట్లా పేదల ఇళ్లను కూలగొట్టి మరీ వ్యాపారం చేసి డబ్బులు సంపాదిస్తున్నారన్నారు. అడ్డగోలు హామీలు ఇచ్చి డిక్లరేషన్ల పేరుతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాలను కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తున్నదని కేటీఆర్ అన్నారు. పార్టీతో పాటు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వంటి ప్రతి ఒక్కరూ తెలంగాణకు వచ్చి వంద రోజుల్లోనే తాము ఇచ్చిన హామీలకు చట్టబద్ధత కల్పిస్తామని చెప్పిన విషయాన్ని కేటీఆర్ గుర్తు చేశారు. అందుకే రాష్ట్రంలో ఆరు గ్యారంటీలను మొదటి కేబినెట్ లో నిర్ణయం తీసుకొని చట్టబద్ధత కల్పించి అమలు చేస్తామని రాహుల్ సహా అందరూ చెప్పిన మాటలను గుర్తు చేస్తూ ప్రజలకు బాకీ పడిన ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీ సమావేశాల్లో ప్రైవేట్ మెంబర్ బిల్లును తీసుకువచ్చే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తామని కేటీఆర్ తెలిపారు. ప్రభుత్వం మెడలు వంచి ప్రజలకు హామీలు అమలు చేసేలా ప్రయత్నిస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఈ బిల్లుకు ఓటు వేయాల్సి వస్తుందని, ఎందుకంటే తమ సొంత నాయకుడు రాహుల్ చెప్పిన మాటనే తాము అసెంబ్లీలో చెప్తామన్నారు. ఈ బిల్లుకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చి రాహుల్ సహా తమ పార్టీ నేతలు అంతా ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని కేటీఆర్ అన్నారు.
—————————————————————————————————————————————————————————————–
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.




