– మూడేళ్లలో 3.44 లక్షల వ్యవసాయ కనెక్షన్ల మంజూరు
– రంగంలోకి విద్యుత్ అంబులెన్స్‌లు.. 1912కు ఫోన్ చేస్తే పరిష్కారం
– ప్రజా బాట ద్వారా క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారం
– శాసనమండలిలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటన
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 5ః రాష్ట్రంలో విద్యుత్ రంగాన్ని పటిష్టం చేస్తూ రైతులకు, సామాన్య ప్రజలకు నాణ్యమైన సేవలు అందించడమే ప్రజా ప్రభుత్వ ధ్యేయమని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పునరుద్ఘాటించారు. శాసనమండలిలో సోమవారం ప్రశ్నోత్తరాల సమయంలో విద్యుత్ శాఖపై జరిగిన చర్చకు ఆయన సుదీర్ఘంగా సమాధానమిచ్చారు. గత ప్రభుత్వాల హయాంలో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరిస్తూనే ఆధునిక సాంకేతికతతో విద్యుత్ శాఖను ప్రజల ముంగిటకే తీసుకెళ్తున్నామని వివరించారు. 2022 జనవరి నుంచి 2025 డిసెంబర్ వరకు పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి ఏకంగా 3,44,462 మంది రైతులకు కొత్త విద్యుత్ కనెక్షన్లు కల్పించినట్లు తెలిపారు. కనెక్టెడ్ లోడ్ కనెక్షన్ల అనుగుణంగా 75,686 కొత్త ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేశామన్నారు. సీనియారిటీని ప్రాతిపదికగా తీసుకుని ఎక్కడా వివక్ష లేకుండా కనెక్షన్లు ఇస్తున్నామని, మరో 9,700 మంది రైతులకు లైన్ పనులు పూర్తి కాగానే ట్రాన్స్‌ఫార్మర్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. గత రెండేళ్లలో (2024, 2025) దాదాపు 2 లక్షల అదనపు కనెక్షన్లు ఇవ్వడం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు.
అంబులెన్స్ తరహాలో విద్యుత్ సేవలు.. ఏవీ కొరత లేవు
విద్యుత్ అంతరాయం కలిగితే గంటలతరబడి వేచి చూడాల్సిన అవసరం లేకుండా ‘108’ తరహాలో విద్యుత్ అంబులెన్స్‌లను అందుబాటులోకి తెచ్చామని డిప్యూటీ సీఎం వెల్లడించారు. 1912 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేసిన వెంటనే మొబైల్ ట్రాన్స్‌ఫార్మర్లు, థర్మల్ విజన్ కెమెరాలు, సేఫ్టీ గేర్ బాక్సులతో కూడిన వాహనం క్షేత్రస్థాయికి చేరుకుంటుందని తెలిపారు. ఈ వాహనంలో ఒక ఇంజనీర్ఇ, ద్దరు సిబ్బంది ఉండి యుద్ధప్రాతిపదికన సమస్యను పరిష్కరిస్తారని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు లేదా వైర్ల కొరత లేదని భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ప్రజా బాట కార్యక్రమంలో అధికారులు వారానికి మూడు రోజులు పొలాల్లోనే ఉండి వంగిన స్తంభాలను, వేలాడుతున్న తీగలను సరిచేస్తున్నారని చెప్పారు. సభ్యులు ఏదైనా సమస్యను లిఖితపూర్వకంగా తన దృష్టికి తెస్తే కేవలం 24 గంటల్లోనే పరిష్కరిస్తామని సభలో ధీమా వ్యక్తం చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





