– మహారాష్ట్ర గవర్నర్ పదవికి రాజీనామా
– రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాట్లు
– హాజరుకానున్న ప్రధాని మోదీ, తదితరులు
న్యూదిల్లీ,ప్రజాతంత్ర, సెప్టెంబర్11: ఉపరాష్ట్రపతిగా ఘన విజయం సాధించిన సీపీ రాధాకృష్ణన్ శుక్రవారం ప్రమాణ స్వీకారం చేసేందుకు ఏర్పాట్లు చేశారు రాధాకృష్ణన్ 15వ భారత ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఉపరాష్ట్రపతి చేత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ తదితర కేంద్ర మంత్రులు, విపక్ష నేతలు, ఇతర విఐపిలు హాజరవుతారు. ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ దన్‌ఖడ్ రాజీనామా చేశాక సెప్టెంబర్ 9న జరిగిన ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి రాధాకృష్ణన్ ప్రత్యర్థి సుదర్శన్ రెడ్డిపై 148 వోట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. కాగా, మహారాష్ట్ర గవర్నర్ పదవికి రాధాకృష్ణన్ రాజీనామా చేసారు. ఈమేరకు రాష్ట్రపతి భవన్ ప్రకటన విడుదల చేసింది. ఈ క్రమంలో గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్‌కు మహారాష్ట్ర గవర్నర్‌గా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అదనపు బాధ్యతలు అప్పగించారు. తాను రాజీపడని జాతీయ వాదినని రాధాకృష్ణన్ చెప్పారు. బుధవారం ముంబయిలోని రాజ్‌భవన్‌లో సత్కారం అందుకున్నారు. గవర్నర్‌గా ఇక్కడ కొనసాగిన 13 నెలలు. ప్రజాజీవితంలో తనకెంతో సంతోషకరమైన సమయమని, ఆ మధుర స్మృతులను దిల్లీకి తీసుకువెళ్తున్నానని చెప్పారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ స్ఫూర్తిదాయక గాథల్ని తమ తల్లి చెబుతుండేది. విదేశీ దురాక్రమణదారులపై శివాజీ పోరాడినట్లే దేశంలో అణచివేతపై అంబేడ్కర్ పోరు సాగించారు. అలాంటి దార్శనికుల వల్లనే ప్రజాస్వామ్య దేశంగా భారత్ మనుగడ సాగిస్తోంది. ఇదిలావుంటే ఇండియా కూటమి తరఫున పోటీచేసి ఓడిపోయిన జస్టిస్ బి.సుదర్శన్‌రెడ్డి రాధాకృష్ణన్‌ను కలిసి అభినందించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





