ముగిసిన రాధాగోవింద రథయాత్ర

– భక్తిశ్రద్ధలతో పాల్గొన్న వేలాదిమంది భక్తులు

హైదరాబాద్. ప్ర‌జాతంత్ర‌, డిసెంబర్ 13 : హరేకృష్ణ మూమెంట్, హైదరాబాద్ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన శ్రీ రాధా గోవింద రథయాత్ర కోకాపేటలో అత్యంత వైభవంగా జరిగింది.వేలాదిమంది భక్తులు పాల్గొని సంస్కృతి, సాంప్రదాయాలతో రథయాత్రను మహోత్సవంలా జరుపుకున్నారు. రథంలో ఉంచిన‌ రాధాగోవిందుల సుందరమైన విగ్రహాలు దివ్య రూపంలో విరాజిల్లగా, భక్తులు అపారమైన ఉత్సాహంతో రథాన్ని ముందుకు లాగారు. ర‌థ యాత్ర ఆసాంతం సంకీర్తనలు, భజనలతో మార్మోగింది. శ్రీ కృష్ణ గోసేవ మండల గోశాలలో ప్రారంభమైన రథయాత్ర గండిపేట మెయిన్ రోడ్ ‘వై’ జంక్షన్ నుంచి కోకాపేట ‘ఎక్స్’ రోడ్, అల్లు స్టూడియోస్, 7 హిల్స్ గేటెడ్ కమ్యూనిటీ, రాజపుష్ప ఆత్రియా, గోల్డెన్ మైల్ రోడ్ మీదుగా హరేకృష్ణ హెరిటేజ్ టవర్ ప్రాజెక్టు స్థలానికి చేరుకుంది. మార్గంమధ్యలోని నివాసులు రథంపై పూలు చల్లుతూ ప్రార్థనలు చేస్తూ రాధాగోవిందుల దర్శనం చేసుకున్నారు. ప్రకాశవంతమైన దీపాలతో, పూలతో ర‌థాన్ని రమణీయంగా అలంకరించారు. 500 మందికిపైగా భక్తులు రథాన్ని లాగుతూ భక్తిని, ఐక్యతను ప్రదర్శించారు. వలంటీర్లు, అనౌన్స్‌మెంట్ టీమ్‌లు, భద్రతా బృందాలు సమన్వయంగా సేవలు అందించి దైవ సేవలో తరించాయి. తొలుత అతిథుల చేతుల మీదుగా ప్రథమ పూజ, ప్రథమ ఆరతిని నిర్వహించగా రథయాత్ర మార్గంలో పరిశుద్ధ కార్యక్రమం జ‌రిగింది. ముఖ్య అతిథిగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నగేశ్ భీమపాక హాజరయ్యారు. సత్యగౌర చంద్రదాస ప్రభూజీ (ఎంటెక్, ఐఐటీ–మద్రాస్), హరేకృష్ణ మూమెంట్, హైదరాబాద్ & ప్రాంతీయ అధ్యక్షుడు , అక్షయపాత్ర ఫౌండేషన్ (తెలంగాణ & ఆంధ్రప్రదేశ్) ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. రథయాత్రలో భాగంగా భక్తులు హరిదాసుల భజన–కీర్తనలు ఆలపిస్తూ, వేదసాహిత్య పుస్తకాలను పంపిణీ చేశారు. పిల్లల వేషధారణ నాటికలు, బేసిల్ ఉడ్స్ స్కూల్ విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు, రంగురంగుల రంగోలీలు, కోలాటం నృత్యాలతో రథయాత్ర మరింత ఆకర్షణీయంగా మారింది. 20వేల మందికిపైగా భక్తులకు దొన్న ప్ర‌సాదం పంపిణీ జ‌రిగింది. కార్యక్రమం ముగింపు సందర్భంగా హరేకృష్ణ హెరిటేజ్ టవర్ స్థలంలో సత్య గౌర చంద్రదాస ప్రభూజీ ప్రవచనం, మహా మంగళహారతి నిర్వహించారు. అనంతరం భక్తులకు ప్ర‌సాద విత‌ర‌ణ జ‌రిగింది. రథయాత్ర చారిత్రకత గురించి, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత, చైతన్య మహాప్రభువు సంకీర్తన ఉద్యమం, విశ్వగురు శ్రీల ప్రభుపాదుల ప్రపంచవ్యాప్త కృష్ణ భక్తి ప్రచార యజ్ఞంతో అనుసంధానిస్తూ ప్రభూజీ తన ప్రవచనంలో వివరించారు. కార్యక్రమం విజయవంతానికి సహకరించిన విశిష్ట అతిథులు, భక్తులు, వలంటీర్లు, పోలీస్ సిబ్బంది, మీడియా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులకు ప్రభూజీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. రథయాత్ర వంటి ఆధ్యాత్మిక ఉత్సవాలు సమాజంలో శాంతి, ఐక్యత, ఆధ్యాత్మిక అవగాహన పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని హరేకృష్ణ మూమెంట్ సంస్థ పునరుద్ఘాటించింది.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *