– ఈ యేడాది ఆకుపచ్చ రంగులో సారె
– పిప్రి సభలో సిఎం రేవంత్ ప్రకటన
ఆదిలాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 6: గత ప్రభుత్వాల హయాంలో పంపిణీ చేసిన చీరల రంగులు, నాణ్యతపై ప్రజల్లో భిన్నభిప్రాయాలు ఉండేవని గుర్తు చేస్తూ, తమ ప్రభుత్వం మహిళల మనసు గెలుచుకునేలా కొత్త నిర్ణయం తీసుకుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆదిలాబాద్ జిల్లా పిప్రిలో జరిగిన భారీ బహిరంగ సభలో మహిళా లోకానికి బతుకమ్మ శుభవార్త చెప్పారు. రాష్ట్రంలోని ఆడబిడ్డలకు తమ ప్రభుత్వం ఇచ్చే చీరలు కేవలం వస్త్రాలు మాత్రమే కాదని.. అవి పుట్టింటి వారు ప్రేమతో పెట్టే ‘సారె’ అంత పవిత్రమైనవని సీఎం రేవంత్ రెడ్డి అభివర్ణించారు. గతంలో పాలపిట్ట రంగు చీరలను పంపిణీ చేసిన విషయాన్ని గుర్తు చేస్తూ, ఈసారి అంతకంటే ఆకర్షణీయమైన, మహిళలకు ఎంతో ఇష్టమైన ’చిలుక పచ్చ’ రంగు చీరలను అందించబోతున్నామని స్పష్టం చేశారు. ఈ ప్రత్యేకమైన చిలుక పచ్చ రంగు చీరలను వచ్చే డిసెంబర్ నెలలో పంపిణీ చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. పండగలు, శుభకార్యాల సమయంలో ఆడబిడ్డలు గర్వంగా ధరించేలా నాణ్యమైన చీరలను సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. మహిళల గౌరవాన్ని పెంచేలా, వారి ముఖాల్లో చిరునవ్వులు చూసేలా ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలిపారు. ఆదాయం పెంచి పేదలకు పంచడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు. ఇప్పటికే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించామని.. ఇప్పుడు నాణ్యమైన చీరల పంపిణీ ద్వారా ఆడబిడ్డల పట్ల తమకున్న అంకితభావాన్ని చాటుకుంటున్నామని చెప్పారు. మహిళా శక్తిని గౌరవించడంలో తమ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని ఆయన అన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.