ఈఎస్‌ఐ హాస్పిటల్స్‌లో నాణ్యమైన వైద్యం

– ఈఎస్‌ఐ వ్యవస్థాపక దినోత్సవంలో మంత్రి వివేక్

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 24: కార్పొరేట్ హాస్పిటల్స్‌లో లక్షల రూపాయల ఫీజులు వసూలు చేస్తున్న ఈ కాలంలో ఈఎస్‌ఐ వంటి సంస్థలు కార్మికులకు నాణ్యమైన వైద్యసేవలను అందించడం అభినందనీయమని కార్మిక, గనుల శాఖ మంత్రి డాక్టర్ జి.వివేక్ వెంకటస్వామి అన్నారు. సనత్‌నగర్ ఈఎస్‌ఐ హిస్పిటల్‌లో మంగళవారం జ‌రిగిన‌ ఈఎస్‌ఐ వ్యవస్థాపక దినోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ డాక్టర్ అంబేద్కర్ దూరదృష్టితోనే కనీస వేతనాలు, కార్మికుల హక్కులు, వారి భద్రత కోసం ఈఎస్‌ఐ కార్పొరేషన్‌ను స్థాపించినట్లు పేర్కొన్నారు. కార్మికుల సంక్షేమం కోసం తీసుకున్న ఆ నిర్ణయం దేశంలోని లక్షలాది కార్మిక కుటుంబాలకు ఆరోగ్య భరోసాను కల్పించిందన్నారు. గతంతో పోలిస్తే ఈఎస్‌ఐ హాస్పిటల్స్‌లో సదుపాయాలు విస్తృతంగా మెరుగుపడ్డాయన్నారు. రోగికి వైద్యంతోపాటు ధైర్యం ఇవ్వడం కూడా వైద్యుల బాధ్యత అని అన్నారు. ప్రభుత్వ హాస్పిటల్స్‌పై విమర్శలు వినిపించినా ఈఎస్‌ఐ హాస్పిటల్స్ సేవలపై పెద్దగా ఫిర్యాదులు రావని అన్నారు. ప్రభుత్వం కూడా కార్మికులకు వైద్య సేవల విషయంలో చిత్తశుద్ధితో పనిచేస్తోందని, ఈ సేవలను మరింత విస్తరించేందుకు శంషాబాద్‌లో కొత్త హాస్పిటల్ నిర్మాణానికి భూమి కేటాయించేందుకు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారని వెల్లడించారు. చెన్నూరులో 50 పడకలతో ప్రారంభమైన చిన్న హాస్పిటల్ ప్రస్తుతం పూర్తిస్థాయిలో సేవలందిస్తోందని మంత్రి తెలిపారు. 18 ఈఎస్‌ఐసీ డిస్పెన్సరీలు రద్దవుతున్నాయన్న సమాచారం అందిన వెంటనే కేబినెట్‌లో చర్చించి వాటి నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఈఎస్‌ఐ హాస్పిటల్‌లో అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహించడం గొప్ప విషయమంటూ అవయవదాతలకు మంత్రి ప్రత్యేక అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ సెక్రటరీ దాన కిషోర్, ఈఎస్‌ఐసీ రీజినల్ డైరెక్టర్ రాజీవ్‌లాల్ తదితరులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *