చిన్నారులకు నాణ్యమైన విద్య, పోషకాహారం

– ప్రముఖ ఆర్థికవేత్త కార్తీక్ మురళీధరన్‌తో సీఎం
– సమగ్ర మానవాభివృద్ధి అంశంపై సమీక్ష

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 26: రాష్ట్రంలోని ప్రతి చిన్నారికీ నాణ్యమైన విద్య, పోషకాహారం అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రితో ప్రముఖ ఆర్థికవేత్త కార్తీక్ మురళీధరన్ రాష్ట్ర శాసనమండలి హాల్‌లో గురువారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారు చర్చించారు. రాష్ట్రంలో 0-10 ఏళ్లలోపు పిల్లల్లో పోషకాహారం లోపం, విద్యాభ్యాసన స్థాయి సామర్థ్యలోపాలకు సంబంధించి పలు నివేదికలను కార్తీక్ మురళీధరన్ సీఎం దృష్టికి తీసుకొచ్చారు. చిన్న వయస్సులో పోషకాహారం లోపంతో భవిష్యత్తులో తలెత్తే ఆరోగ్య సమస్యలు.. ప్రాథమిక స్థాయిలో సరైన బోధన లభించకపోతే విద్యార్థి భావి జీవితంలో పడే మానసిక వేదనను ఆయన తెలియజేశారు. వాటిని అధిగమించడానికి తీసుకోవాల్సిన అంశాలను సూచించారు. ఆయా అంశాలపై తాము ఇప్పటికే ప్రత్యేక శ్రద్ధ పెట్టామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంతోపాటు అల్పాహారం పెట్టేందుకు బడ్జెట్‌లో కేటాయింపులు చేసినట్లు వివరించారు. అంగన్‌వాడీల్లో కార్యకర్తలు, ఆయాలతోపాటు పోషకాహారం అందజేసేందుకు అదనంగా మరొకరిని నియమించాలని కార్తీక్ మురళీధరన్ సూచించారు. అంగన్‌వాడీల్లో పిల్లలకు పోషకాహారం అందజేసేందుకు పోషణ సఖి పేరుతో మరొకరిని నియమించేందుకు అవకాశం ఉందని అధికారులు తెలియజేశారు. కార్తీక్ మురళీధరన్ సూచించే అంశాలను కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీ (క్యూర్) పరిధిలోని 29 స్కూల్ కాంప్లెక్స్‌ల పరిధిలో ప్రయోగాత్మకంగా అమలు చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని, కార్తీక్ మురళీధరన్‌తో సమన్వయం చేసుకుని దీనిపై ప్రత్యేక నివేదిక రూపొందించి సమర్పించాలని ఆదేశించారు. సమీక్షలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ వి.శేషాద్రి, సీఎం కార్యదర్శి మాణిక్ రాజ్, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, ఆర్థిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా, విద్యా శాఖ కార్యదర్శి యోగితా రాణా, మహిళా, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, ప్రణాళిక శాఖ కార్యదర్శి డాక్టర్ గౌరవ్ ఉప్పల్, సెర్ప్ సీఈవో దివ్య, డిప్యూటీ సీఎం కార్యదర్శి కృష్ణభాస్కర్, మహిళా, శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్ శతి ఓజా, పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్, సీఎం ఓఎస్డీ వేముల శ్రీనివాసులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *