– తప్పిపోయిన ఇద్దరి ఆచూకీ గంటల్లోనే లభ్యం
– మల్టీ జోన్-2 ఐజి చంద్రశేఖర్ రెడ్డి
హైదరాబాద్, ప్రజాతంత్ర, జనవరి 29: మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతర సందర్భంగా రాష్ట్ర ప్రజలకు మల్టీ జోన్-2 ఐజీ ఎస్.చంద్రశేఖర్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. జాతర రద్దీలో చిన్నారులు తప్పిపోయే ప్రమాదం ఉన్నందున వారి రక్షణ కోసం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన క్యూఆర్ కోడ్ రిస్ట్ బ్యాండ్ వ్యవస్థను భక్తులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈమేరకు టీజీఎస్ ఆర్టీసీ సహకారంతో భక్తులు వచ్చే ప్రధాన మార్గాల్లో 11 ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసి పిల్లలకు ఈ బ్యాండ్లను ఉచితంగా అందజేస్తున్నట్లు వెల్లడించారు. హన్మకొండ హయగ్రీవాచారి గ్రౌండ్, హైదరాబాద్ ఉప్పల్, ఎంజీబీఎస్‌లలో, కరీంనగర్, పరకాల, పెద్దపల్లి, మంథని, ఏటూరునాగారం, కాటారం బస్ స్టేషన్లతోపాటు వరంగల్ రైల్వే స్టేషన్, కాజీపేట్ రైల్వే స్టేషన్లలో రిస్ట్ బ్యాండ్లను అందజేసే కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలియజేశారు. జాతరలో ఎవరైనా చిన్నారి తప్పిపోయినట్లు కనిపిస్తే వారి చేతికి ఉన్న రిస్ట్ బ్యాండ్‌పై గల క్యూఆర్ కోడ్‌ను స్మార్ట్‌ఫోన్ ద్వారా స్కాన్ చేయాలన్నారు. స్కాన్ చేసిన వెంటనే లభించే ఫోన్ నంబర్ ద్వారా ఆ పిల్లల బంధువులకు లేదా పోలీసులకు సమాచారం అందించి, చిన్నారులను క్షేమంగా వారి కుటుంబ సభ్యుల వద్దకు చేర్చవచ్చని ఆయన వివరించారు. ఎసఐబి, ఐజిపి బి.సుమతి, వోడాఫోన్ వారి సహకారంతో ఈ వినూత్న సాంకేతిక ప్రక్రియను రూపొందించామని తెలిపారు. ఈ నూతన ప్రక్రియను విజయవంతం చేసేందుకు భక్తులు, స్వచ్ఛంద సంస్థలు పోలీసులకు సహకరించాలని ఐజీ కోరారు. కాగా, ఈ క్యూఆర్ రిస్ట్ బ్యాండ్లు జాతరలో ఇప్పటికే సత్ఫలితాలను ఇస్తున్నాయని వెల్లడించారు.
గంటల వ్యవధిలో తప్పిపోయిన చిన్నారుల గుర్తింపు
తప్పిపోయిన ఇద్దరు చిన్నారులను కేవలం గంటల వ్యవధిలోనే గుర్తించి, వారి తల్లిదండ్రుల వద్దకు సురక్షితంగా చేర్చినట్లు తెలిపారు. కరీంనగర్ బస్టాండ్‌లో రిస్ట్ బ్యాండ్ వేయించుకున్న మురళీకృష్ణ కుమారుడు అరియాన్ష్ (4) జాతరలో తప్పిపోగా ఈ సాంకేతికత ఆధారంగానే అతడిని త్వరగా గుర్తించగలిగామన్నారు. అలాగే హనుమకొండ హయగ్రీవచారి గ్రౌండ్స్‌లో రిస్ట్ బ్యాండ్ ధరించిన గోవిందరావుపేట గ్రామానికి చెందిన మిల్కీ అనే బాలిక కూడా తప్పిపోయిన కొద్దిసేపటికే తన తండ్రి గుంజ నాగరాజు చెంతకు చేరిందని ఐజి చంద్రశేఖర్ రెడ్డి వివరించారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





