- ‘పీవీ జిల్లా’ ఏర్పాటుకు నా వంతు కృషి
- హుజూరాబాద్‌లో మాజీ ప్రధాని విగ్రహాన్ని ఆవిష్కరించిన వొడితల ప్రణవ్
హుజూరాబాద్, ప్రజాతంత్ర: భారత దేశం ఆర్థిక సంక్షోభంలో ఉన్న తరుణంలో పీవీ నరసింహారావు ప్రవేశపెట్టిన సంస్కరణలే నేడు దేశాన్ని అగ్రపథాన నిలిపాయని హుజూరాబాద్ (Huzurabad) కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ అన్నారు. ఆదివారం హుజూరాబాద్ పట్టణంలోని సైదాపూర్ క్రాస్ రోడ్‌లో ఏర్పాటు చేసిన పీవీ నరసింహారావు విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం జరిగిన సభలో ప్రణవ్ మాట్లాడుతూ.. పీవీ నరసింహారావు చరిత్ర భావి తరాలకు నిరంతరం స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. “మా కుటుంబానికి పీవీ అత్యంత ఆప్తులు. ఆయన కేవలం రాజనీతిజ్ఞుడు మాత్రమే కాదు, బహుభాషా కోవిదుడు. దేశ ఆర్థిక వ్యవస్థలో నూతన ఒరవడిని సృష్టించడమే కాకుండా, విద్యారంగానికి ఆయన చేసిన కృషి అనన్యసామాన్యం. నవోదయ పాఠశాలల స్థాపన ద్వారా వేలాది మంది పేద విద్యార్థుల జీవితాల్లో ఆయన వెలుగులు నింపారు” అని కొనియాడారు.
‘పీవీ జిల్లా’ ఏర్పాటుకు నా వంతు కృషి
స్థానిక ప్రజల దీర్ఘకాలిక డిమాండ్ అయిన ‘పీవీ జిల్లా’ ఏర్పాటుపై ప్రణవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. హుజూరాబాద్‌ను కేంద్రంగా చేసుకుని పీవీ జిల్లా ఏర్పాటు చేయాలని ఈ ప్రాంత ప్రజలు కోరుతున్నారని, భవిష్యత్తులో జిల్లాల పునర్విభజన ప్రక్రియ జరిగినప్పుడు పీవీ జిల్లా సాధన కోసం తన వంతుగా పూర్తిస్థాయిలో కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, పీవీ అభిమానులు పట్టణ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




