మక్కలు మార్కెట్లోకి వచ్చినా కొనుగోళ్లు ఏవీ?

– రూ.2400 మద్దతు ధర, రూ.500 బోనస్‌ చెల్లించాలి
– ప్రభుత్వ తీరుతో రైతులకు తీవ్ర నష్టం
– గన్‌పార్క్ ‌వద్ద బిఆర్‌ఎస్‌ ‌నేతల ఆందోళన
– అసెంబ్లీ వద్ద ఎమ్మెల్యేలతో మార్షల్స్ ‌దురుసు ప్రవర్తన

‌హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, మార్చి 18: మొక్కజొన్న రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై కాంగ్రెస్‌ ‌ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిలదీస్తూ, రైతులకు అండగా బీఆర్‌ఎస్‌ ‌పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గన్‌పార్క్ ‌నుంచి అసెంబ్లీ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. గన్‌పార్క్ ‌వద్ద బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు కేటీఆర్‌, ‌హరీశ్‌ ‌రావు, ఎమ్మెల్సీ శ్రవణ్‌, ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. మొక్కజొన్న రైతులను ఆదుకోవాలని నినాదాలు చేశారు. మార్కెట్లకు పోటెత్తిన మక్కలను కొనుగోలు చేయకపోవడంతో రైతన్నకు తిప్పలు అంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు. మొక్కజొన్నలతో గన్‌పార్క్‌లో గులాబీ పార్టీ నేతలు నినాదాలు చేసారు. అక్కడి నుంచి కాలినడకన అసెంబ్లీకి వెళ్లారు. ఈ సందర్భంగా గన్‌పార్క్ ‌వద్ద తెలంగాణ అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన అనంతరం మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ‌డిప్యూటీ ప్లోర్‌ ‌లీడర్‌ ‌హరీశ్‌ ‌రావు మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వంపై మండిపడ్డారు. వరి వేయొద్దని, పంట మార్పిడి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పదేపదే చెబితే ఆ మాటలు నమ్మి రాష్ట్రంలో రైతులు సుమారు 8 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారని తెలిపారు. తీరా పంట చేతికి వచ్చాక ఆ రైతులను కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం నట్టేట ముంచుతోందని అన్నారు. మొక్కజొన్న మార్కెట్లకు రావడం మొదలై ఇప్పటికే 15 రోజులు అవుతున్నా, రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ కొనుగోలు కేంద్రాలను ప్రారంభించకపోవడం దారుణమని మండిపడ్డారు. దీనివల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మొక్కజొన్నకు మద్దతు ధర రూ. 2400 ఉంటే కొనుగోలు కేంద్రాలు లేక రైతులు దళారులకు రూ.1600 నుంచి రూ.1700లకే అమ్ముకుంటూ తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. పదిహేను రోజులుగా కొనుగోలు కేంద్రాలు తెరవకపోవడం చూస్తుంటే ప్రభుత్వ ఆంతర్యం ఏమిటో అర్థమవుతోందన్నారు. పంట దళారుల పాలైన తర్వాత ఆ దళారుల దగ్గర ఎక్కువ ధరకు కొని వాళ్లకు మేలు చేయాలని ప్రభుత్వం చూస్తోందా అని ప్రశ్నించారు. ఒకవైపు మద్దతు ధర లేక నష్టపోతుంటే మరోవైపు అకాల వర్షాలకు మార్కెట్‌ ‌యార్డుల్లో, కల్లాల్లో ఆరబోసిన మొక్కజొన్న తడిచిపోయి రైతులు కన్నీరు పెడుతున్నారని తెలిపారు. రెండు రోజులుగా కురిసిన వడగండ్ల వానలకు మొక్కజొన్న, మామిడి సహా ఇతర పంటలకు పెద్ద ఎత్తున నష్టం జరిగిందన్నారు. బ్జడెట్‌లో పంటల బీమా గురించి గొప్పగా ఊదరగొట్టిన కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ఆచరణలో అమలు చేయడం లేదని చెప్పారు. ఈ ప్రభుత్వం అటు పంటల బీమా అమలు చేయదు, ఇటు ఇన్‌ ‌పుట్‌ ‌సబ్సిడీ ఇవ్వదని మండిపడ్డారు. గత రెండు సంవత్సరాలుగా రాష్ట్ర రైతాంగానికి ఇన్‌ ‌పుట్‌ ‌సబ్సిడీ అందడం లేదని తెలిపారు. ప్రభుత్వం కేవలం మాటల్లో చెబుతున్నదే తప్ప ఇప్పటివరకు నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు సబ్సిడీ నిధులను విడుదల చేయడం లేదన్నారు. అకాల వర్షాలు, వడగండ్ల వానల వల్ల జరిగిన నష్టంపై అన్ని జిల్లాల నుంచి వెంటనే నివేదికలు తెప్పించుకోవాలని సూచించారు. తక్షణమే ఎన్యూమరేషన్‌ ‌చేసి నష్టపోయిన రైతులకు ఇన్‌ ‌పుట్‌ ‌సబ్సిడీ చెల్లించి ఆదుకోవాలని డిమాండ్‌ ‌చేశారు. వెంటనే కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి, మద్దతు ధరకు కొనుగోలు చేయాలన్నారు. 25 శాతం పంట దళారుల చేతికి వెళ్లిందన్నారు. ఇన్‌పుట్‌ ‌సబ్సిడీ, రూ.2400 మద్దతు ధర, రూ.500 బోనస్‌  ప్రభుత్వం వెంటనే చెల్లించాలని హరీశ్‌ ‌రావు డిమాండ్‌ ‌చేశారు. మొక్కజొన్న రైతులను కాంగ్రెస్‌ ‌సర్కార్‌ ఆదుకోవాలని డిమాండ్‌ ‌చేస్తూ అసెంబ్లీకి వచ్చిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలతో మార్షల్స్ ‌దురుసుగా ప్రవర్తించారు. ప్ర‌వేశ‌ద్వారం ‌వద్ద ఎమ్మెల్యేల నుంచి మక్కలు, కందులు లాక్కున్నారు. ఈ క్రమంలో ‌హరీష్‌ ‌రావు చేతికి గాయమై రక్తం వచ్చింది. మరోవైపు అసెంబ్లీ ఎంట్రన్స్ ‌వద్ద పాడి కౌశిక్‌ ‌రెడ్డి చేతిలో నుంచి చీఫ్‌ ‌మార్షల్‌ ‌కరుణాకర్‌ ‌మక్కలు లాక్కొని కిందబోశారు. మార్షల్స్ ‌తీరుపై ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ గేటు వద్ద కూర్చొని మార్షల్స్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *