– ఆయన భార్య అమ్మీత్‌కు సీఎం రేవంత్‌రెడ్డి హామీ
– కుల ఆధారిత వివక్షపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి
– చండీగఢ్‌లో పూరన్ కుటుంబానికి భట్టి పరామర్శ
చండీగఢ్, అక్టోబర్ 13: చండీగఢ్‌లో ఆత్మహత్యకు పాల్పడిన ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ కుటుంబ సభ్యులను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు సోమవారం పరామర్శించారు. ఆయన సతీమణి అమ్నీత్ (ఐఏఎస్)ను సీఎం రేవంత్ రెడ్డితో ఫోన్‌లో మాట్లాడిరచగా బాధిత కుటుంబానికి అండగా ఉంటామని సీఎం హామీ ఇచ్చారు, ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. దేశంలోని అత్యున్నత సర్వీసులో పనిచేస్తున్న అదనపు డీజీ స్థాయి అధికారికే సామాజిక న్యాయం దక్కని పరిస్థితుల్లో ఇక సామాన్యుల పరిస్థితి ఏమిటని చండీగఢ్ చీఫ్ సెక్రటరీ రాజేష్ ప్రసాద్‌ను భట్టి విక్రమార్క ప్రశ్నించారు. పూరన్ ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులను తెలుసుకుని కుల ఆధారిత వివక్ష వంటి ఘటనలు మళ్లీ జరగకూడదని, ఇలాంటి అన్యాయాలపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. తెలంగాణ ప్రభుత్వం పూరన్ కుమార్ కుటుంబానికి అండగా ఉంటుందని డిప్యూటీ సీఎం హామీ ఇచ్చారు. అమ్నీత్‌ను పరామర్శించడానికి వచ్చిన హర్యానా చీఫ్ సెక్రటరీ అనురాగ్ రస్తోగితో భట్టి విక్రమార్క మాట్లాడారు. ఈ ఘటనకు సంబంధించి సూసైడ్ నోట్ ఆధారంగా ఎంత పెద్ద వాళ్ళు ఉన్నా కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించి పూరన్ కుమార్ కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. అనంతరం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. పూరన్ కుమార్ అత్యంత ప్రతిభావంతుడు. ప్రసిద్ధి గాంచిన ఉస్మానియా యూనివర్సిటీ లో ఇంజనీరింగ్ పట్టభద్రుడు, ఐఐఎం అహ్మదాబాదులో చదివిన గొప్ప మేధావి. ఉన్నతాధికారుల కుల వివక్ష, వేధింపులు భరించ లేక ఆత్మహత్య చేసుకోవడం చాలా తీవ్రమైన అంశం. పూరన్ కుమార్ సూసైడ్ నోట్ డైయింగ్ డిక్లరేషన్‌గా భావించాలి. ఘటన జరిగి ఇన్ని రోజులైనా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. వృద్ద తల్లిదండ్రులు, ఇద్దరు ఆడపిల్లలు ఉన్న పూరన్ కుమార్ కుటుంబానికి రక్షణ కల్పించి ఆదుకోవాలని హర్యానా ప్రభుత్వాన్ని, చండీగఢ్ పోలీసులను డిమాండ్ చేశారు. కపూర్ అనే అధికారి దళిత వ్యతిరేకి అని తెలిసి కూడా బీజేపీ ప్రభుత్వం అతన్ని డీజీపీనీ చేసిందని, ఈ ప్రభుత్వం ఇన్నేళ్ల స్వతంత్ర భారత దేశంలో డెత్ బెడ్ మీద ఉండి కూడా న్యాయం కోసం ప్రాధేయపడడం దురదృష్టం. అత్యంత పిన్న వయసులోనే ప్రెసిడెంట్ అవార్డు గ్రహీత పూరన్ కుమార్ అని, అతని డెత్ లెటర్ ఆధారంగా సంబంధిత అధికారుల మీద చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. హర్యానా, చండీగఢ్ ప్రభుత్వాలు బీజేపీ పాలనలో ఉన్నాయి.. సీఎం రాజ్యాంగాన్ని పరిరక్షించాలి.. బాధ్యత గల ప్రభుత్వాలు చట్టాన్ని సక్రమంగా అమలు చేయాలి అని అడుగుతున్నాం.. మా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పూరన్ కుమార్ కుటుంబ సభ్యులను ఫోన్‌లో పరామర్శించి అండగా ఉంటామని హామీ ఇచ్చారని భట్టి తెలిపారు. పూరన్ కుమార్ కుటుంబ సభ్యులను పరామర్శించిన వారిలో ఏఐసీసీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ జార్ఖండ్ పార్టీ ఇన్‌చార్జి కొప్పుల రాజు, పార్టీ చండీగఢ్ అధ్యక్షుడు హర్మోహిందర్ సింగ్ లకి, మీడియా అడ్వైజర్ భూపేంద్ర సింగ్ బూర, జస్ప్రీత్ సింగ్, ఏఐసీసీ సెక్రటరీ పర్దీప్ నర్వాల్, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ దీపక్ లుభానా, ఎస్టీ సెల్ అధ్యక్షుడు,రాజ్ దీప్ సిద్ధులు ఉన్నారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





