– అఖండ విజయం కట్టబెట్టిన ప్రజలకు కృతజ్ఞతలు
– మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 13: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని నమోదు చేసుకోవడం పట్ల రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఈ విజయం కేవలం కాంగ్రెస్ పార్టీదే కాక ప్రజల విజయమని, ప్రభుత్వ పథకాల విజయమని పేర్కొన్నారు. పట్టణ ప్రజలు కాంగ్రెస్ పార్టీపై ఉంచిన విశ్వాసం, ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై ఉన్న నమ్మకానికి ఈ ఫలితాలు నిదర్శనమని అన్నారు. పట్టణ ప్రాంత ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని, ప్రజా పాలనకు అఖండ మద్దతు తెలుపుతూ కాంగ్రెస్ పార్టీని ఆదరించారని తెలిపారు. ముఖ్యంగా పట్టణ అభివృద్ధి, మౌలిక వసతుల విస్తరణ, పారదర్శక పాలన, అవినీతి రహిత వ్యవస్థ, ప్రజలకు అందుబాటులో ఉండే పరిపాలన వంటి అంశాలు ఈ విజయానికి ప్రధాన కారణాలని వివరించారు. కాంగ్రెస్ తరఫున గెలిచిన కౌన్సిలర్లు, కార్పొరేటర్లకు మంత్రి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టే విధంగా పని చేయాలని, ప్రతి వార్డులో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు పట్టం కట్టారని మంత్రి పేర్కొన్నారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మంత్రివర్గం సమష్టి కృషితోనే ఈ ఘన విజయం సాధ్యమైందన్నారు. పారదర్శక పాలన, వేగవంతమైన అభివృద్ధి, ప్రజలకు దగ్గరగా ఉన్న ప్రభుత్వం అనే నినాదంతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి తెలిపారు. ప్రజల సమస్యలకు తక్షణ పరిష్కారం చూపే ధోరణి, సంక్షేమ పథకాల సమర్థవంతమైన అమలు వల్లే పట్టణ ప్రజలు మరోసారి కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చారన్నారు. ఈ ఆశీర్వాదాన్ని బాధ్యతగా స్వీకరిస్తూ వచ్చే మూడేళ్లల్లో మరింత అభివృద్ధి, సంక్షేమం అందించే దిశగా పనిచేస్తామని మంత్రి పొన్నం స్పష్టం చేశారు. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడం ప్రభుత్వానికి మొదటి ప్రాధాన్యమని, ప్రతి పట్టణం అభివృద్ధి దిశగా దూసుకెళ్లేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





