ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్‌ను ప్ర‌క్షాళ‌న చేశాం

– మీ భ‌విష్య‌త్తుకోసం కొట్లాడినం
– తెలంగాణ నిర్మాణం బాధ్య‌త మీదే
– గ్రూప్‌-1 నియామ‌క ప్ర‌తాల పంపిణీలో సి.ఎం. రేవంత్‌రెడ్డి

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, సెప్టెంబ‌ర్ 27: అధికారంలోకి రాగానే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను ప్రక్షాళన చేశాం. పరీక్షలు నిర్వహించాం.  ఇది కొంతమందికి నచ్చలేదు.  కడుపునిండా విషం పెట్టుకుని మిమ్మల్ని ఎన్నిరకాలుగా అడ్డుకోవాలని చూశారో మీకు తెలుసు. తెలంగాణ భవిష్యత్ నిర్మాణం చేసే బాధ్యత మీ చేతుల్లో ఉంది. నవ్విన వాడి ముందు జారిపడ్డట్టు చెయ్యకండి. ఒక బాధ్యతతో వ్యవహరించండి. మనమంతా కలిసి దేశానికి తెలంగాణ మోడల్ చూపిద్దామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. శ‌నివారం గ్రూప్-1 నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఆయ‌న పాల్గొని ప్ర‌సంగించారు. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో మీరు భాగస్వాములు కావాల‌ని పిలుపునిచ్చారు. తెలంగాణ భవిష్యత్ నిర్మాణం చేసేందుకు మీరు సహకారం అందించాల‌న్నారు. తెలంగాణ గడ్డకు ఒక చరిత్ర, పౌరుషం ఉన్నాయ‌ని, సామాజిక న్యాయం, సమాన అవకాశాల కోసం ఇక్క‌డ ఎన్నో పోరాటాలు జరిగాయ‌ని కొంతమంది అప్పుడప్పుడు మాట్లాడుతున్నారు, తెలంగాణ ఎక్కడున్నది, ఎక్కడ ఉంటది అని,
వారికి నేను ఒక్కటే చెబుతున్నా తెలంగాణ ఇక్కడే ఉంది, ఇక్కడే ఉంటది. ఇదే తెలంగాణ స్ఫూర్తి, చైతన్యం, ఇది తెలంగాణ భవిష్యత్ అన్నారు. ఏ మారుమూల పల్లెకు, గూడెంకు వెళ్లినా ఆ స్ఫూర్తి కనిపిస్తుంద‌న్నారు. పదేళ్లుగా గ్రూప్ -1 పరీక్షలు నిర్వహించలేదంటే ఎంత బాధ్యతారాహిత్యం?
ఒక యాదయ్య, శ్రీకాంతాచారి, ఇషాన్ రెడ్డి లాంటి వాళ్ల త్యాగాలను అపహాస్యం చేశారన్నారు.గత ప్రభుత్వంలో అర్హత లేని వారిని పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో సభ్యులుగా నియమించ‌డంవ‌ల్ల‌, ప్ర‌శ్నా పత్రాలు జిరాక్స్ సెంటర్ లో కనిపించాయ‌న్నారు.  కొంతమంది 2 కోట్లు, 3 కోట్లు తీసుకుని ఉద్యోగాలు ఇచ్చామని ఆరోపించిండ్రు. అయినా మీ భవిష్యత్ కోసం కొట్లాడినమ‌న్నారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా, కేసులు వేసినా, తప్పుడు ప్రచారం చేసినా ఓపికతో దిగమింగాం. అర్జునుడికి చేప కన్ను మాత్రమే కనిపించినట్లు నాకు మీ భవిష్యత్ మాత్రమే కనిపించింది.
ఇక నుంచి మీరు తెలంగాణ యంత్రాంగాన్ని నడిపించే ఆఫీసర్స్. మీరు, మేము కలిసి తెలంగాణ పునర్ నిర్మాణంలో భాగస్వాములవుదాం. మీ భవిష్యత్ కోసం శ్రమించిన తల్లిదండ్రులను గుండెల్లో పెట్టుకుని చూసుకునే బాధ్యత మీదే. తల్లిదండ్రుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే మీ జీతాల్లోంచి పది శాతం కట్ చేసి వారి ఖాతాల్లో వేస్తామ‌ని హెచ్చ‌రించారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *