కాంగ్రెస్‌పై రెండేళ్లలోనే ప్రజల్లో వ్యతిరేకత

– రేవంత్‌ ‌రెడ్డి దిగిపోవాలని కోరుకుంటున్నారు
– మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ జీవన్‌ ‌రెడ్డి

జగిత్యాల, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 3: ‌కాంగ్రెస్‌ ‌పార్టీ భవిష్యత్తులో ఊహించలేని పరిస్థితి ఎదుర్కొంటుందని కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన  మాజీ ఎమ్మెల్సీ జీవన్‌ ‌రెడ్డి జోస్యం చెప్పారు. తాను ఏ పార్టీలో చేరాలనేది కార్యకర్తల కోరిక మేరకే ఉంటుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌ ‌రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రెండేళ్ల కాంగ్రెస్‌ ‌పాలనకు విసుగొచ్చిన ప్రజలలో మార్పు రావాలి.. రేవంత్‌ ‌రెడ్డి పోవాలి అనే ఆలోచన వచ్చిందన్నారు. కాంగ్రెస్‌ను వీడిన తర్వాత జగిత్యాలలో తొలిసారిగా నిర్వహించిన  మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజల సంక్షేమంతోపాటు ప్రాజెక్టుల నిర్వహణ ప్రధాన అంశమని తెలిపారు. తెలంగాణకు జీవనాడి అయిన‌ ప్రాణహిత నదీ జలాలను వినియోగించుకోకపోవడం, పునరుద్ధరించకపోవడం రేవంత్‌ ‌నిర్లక్ష్య పాలనకు నిదర్శనమని చెప్పారు. కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ఏర్పాటైన రెండేళ్లలోనే మార్పు రావాలనే పరిస్థితి వచ్చిందన్నారు. భాజపా, బీఆర్‌ఎస్‌ ‌నాయకులకు తనపై ఉన్న అభిమానానికి జీవన్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. జీవన్‌ ‌రెడ్డి బీఆర్‌ఎస్‌ ‌పార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం. ఈ నెల 6న అమెరికా నుంచి తిరిగి వచ్చిన వెంటనే కేటీఆర్‌ ‌జీవన్‌ ‌రెడ్డిని కలిసి పార్టీలోకి ఆహ్వానించనున్నట్లు సమాచారం. ఈ నెల 13న జీవన్‌ ‌రెడ్డి బీఆర్‌ఎస్‌లో చేరే అవకాశాలు ఉన్నట్లు, ఆ రోజు మంచి ముహూర్తం ఉండటంతో గులాబీ కండువా కప్పుకోవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. జగిత్యాల నియోజకవర్గం నుంచి బీఆర్‌ఎస్‌ను బలోపేతం చేసేందుకు జీవన్‌ ‌రెడ్డిని పార్టీలోకి తీసుకోవాలని కేటీఆర్‌ ‌భావిస్తున్నట్లు సమాచారం. సీఎం రేవంత్‌ ‌రెడ్డిని టార్గెట్‌ ‌చేసిన ఆయన నిత్యం జనంలోనే ఉంటూ పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జగిత్యాల ప్రాంతంలో బలమైన నేతగా ఉన్న జీవన్‌ ‌రెడ్డి గులాబీ పార్టీలో చేరితే స్థానికంగా బీఆర్‌ఎస్‌కు మంచి ప్రయోజనం కలుగుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *