ప్రజారోగ్యమే సమాజానికి బలమైన పునాది

– ‘వరల్డ్ హెల్త్ డే’ లో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 7: ఆరోగ్యం కోసం ఐక్యంగా.. విజ్ఞాన శాస్త్రానికి మద్దతుగా అనే థీమ్‌తో ఈ సంవత్సరం ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని, ఇది ఆరోగ్య రంగంలో శాస్త్ర సహకారం, ఆధారిత నిర్ణయాల ప్రాముఖ్యతను గుర్తు చేస్తోందని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. వరల్డ్ హెల్త్ డే సందర్భంగా రవీంద్ర భారతిలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఆరోగ్యం అంటే వ్యాధులు లేకపోవడáమే కాదు.. శారీరక, మానసిక, సామాజికంగా ఆరోగ్యంగా ఉండడం కూడా అవసరమని, ప్రజారోగ్యమే అభివృద్ధి చెందిన సమాజానికి బలమైన పునాది అని పేర్కొన్నారు. ప్రభుత్వ వైద్యులు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది, సపోర్టింగ్ స్టాఫ్ సేవల వల్లే ప్రజల ఆరోగ్యం రక్షితంగా ఉందంటూ కోవిడ్ వంటి క్లిష్ట పరిస్థితుల్లో సేవలందించిన వైద్య సిబ్బందికి మంత్రి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ప్రజారోగ్య వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ప్రాథమికస్థాయి నుంచి సూపర్ స్పెషాలిటీస్థాయి వరకు ఆరోగ్య సేవలను బలోపేతం చేస్తున్నామని, మౌలిక వసతులు, మానవ వనరులు, ఔషధాలు, డయాగ్నోస్టిక్ సేవలను మెరుగుపరుస్తున్నామని చెప్పారు. జీవన శైలిలో వచ్చిన మార్పులు, ఆహారపు అలవాట్లు, కాలుష్యం తదితర కారణాలతో డయాబెటిస్, బీపీ, గుండె, మూత్రపిండాలు, క్యాన్సర్ వంటి నాన్ కమ్యునికబుల్ వ్యాధులు పెరుగుతున్నాయన్నారు. ఇవి ప్రజలపై ఆర్థిక భారం పెంచుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యాధులను ఎదుర్కొనేందుకు ప్రివెంటివ్, ప్రమోటివ్, క్యూరెటివ్, రిహాబిలిటేటివ్ విధానంతో సమగ్ర ఆరోగ్య సేవలనందిస్తున్నామని తెలిపారు. 
రాష్ట్రవ్యాప్తంగా ఎన్‌సీడీ క్లినిక్స్, డే కేర్ క్యాన్సర్ సెంటర్లు, పాలియేటివ్, జెరియాట్రిక్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు. కొత్తగా 79 డయాలిసిస్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, 109 ట్రామా కేర్ సెంటర్లను ఏర్పాటు చేసి అత్యవసర సేవలను బలోపేతం చేస్తున్నామని, రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలను కాపాడేందుకు ప్రతి 35 కి.మీ కు ట్రామా కేర్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నామని, రూ.1100 కోట్లతో నాలుగు స్థాయిల ట్రామా కేర్ వ్యవస్థను అమలు చేయబోతున్నామని వివరించారు. అంబులెన్స్ సేవలను బలోపేతం చేస్తూ 213 కొత్త వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చామని, త్వరలో మరిన్ని అంబులెన్సులను అందుబాటులోకి తీసుకొస్తామని, 10 నిమిషాల లోపు ఘటనా స్థలానికి అంబులెన్స్ చేరుకునే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. ఈరోజు క్యాన్సర్‌ను నోటిఫైబుల్ వ్యాధిగా ప్రకటిస్తున్నామన్నారు. క్యాన్సర్ రిజిస్ట్రీ ద్వారా ఖచ్చితమైన డేటాతో మెరుగైన ప్రణాళికలు రూపొందిస్తామని, ప్రతి జిల్లాలో డే కేర్ క్యాన్సర్ సెంటర్ల ద్వారా చికిత్సను ప్రజలకు చేరువ చేశామని, ములుగు, ఆదిలాబాద్ వంటి ప్రాంతాల్లో కూడా కీమోథెరపీ సేవలు అందిస్తున్నామని ఆయన తెలిపారు. ప్రభుత్వ హాస్పిటల్స్‌లో పాలియేటివ్ కేర్ అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. ఈరోజు నిమ్స్‌లో అత్యాధునిక లినాక్ సేవలను ప్రారంభించామని, రాష్ట్రంలో రీజినల్ క్యాన్సర్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేసే దిశగా ముందుకు సాగుతున్నామని చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్యాన్సర్ వంటి వ్యాధులను ముంdఱ్తుగా గుర్తించే దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఆస్ట్రాజెనెకాతో కలిసి 20 ప్రభుత్వ హాస్పిటళ్లలో లంగ్ క్యాన్సర్ ముందస్తు నిర్ధారణపై పైలట్ ప్రాజెక్టును త్వరలో ప్రారంభిస్తున్నామని, ఇందుకోసం ఆస్ట్రాజెనెకాతో ఒప్పందం చేసుకున్నామని చెప్పారు. ప్రతి పౌరుడికీì హెల్త్ ప్రొఫైల్ రూపొందించే దిశగా చర్యలు ప్రారంభించామని, 46 లక్షల మంది స్వయం సహాయక సంఘాల మహిళలకు ఉచితంగా ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ యాక్టు పోర్టల్‌ను ప్రారంభించామని, పీసీపీ-ఎన్‌డీటీ, ఏఆర్‌టీ, సరోగసీ చట్టాల అమలుకు ప్రత్యేక పోర్టల్స్ తీసుకొచ్చామని, పారదర్శకత, నాణ్యత, బాధ్యతాయుత వ్యవస్థను తయారు చేస్తున్నామని చెప్పారు. ఆరోగ్యశ్రీ సేవలను విస్తరిస్తూ ప్రజల ఆర్థిక భారం తగ్గిస్తున్నామన్నారు. ఉద్యోగులు, పెన్షనర్ల కోసం కొత్త ఆరోగ్య పథకాన్ని తీసుకొస్తున్నామని, జిల్లా స్థాయిలోనే 80% వైద్య అవసరాలు తీర్చే లక్ష్యంతో సెకండరీ హెల్త్‌కేర్ వ్యవస్థను బలోపేతం చేస్తున్నామని చెప్పారు. టిమ్స్ హాస్పిటల్స్, వరంగల్ హెల్త్ సిటీ, కొత్త ఉస్మానియా హాస్పిటల్ నిర్మాణం చేపడుతున్నామని, నిమ్స్‌లో 2000 పడకల కొత్త భవనం నిర్మాణం జరుగుతోందని తెలిపారు. ఆరోగ్య శాఖలో రెండేళ్లల్లో 10 వేల పోస్టులు భర్తీ చేశామని, ఇంకా 7 వేల పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. క్యాన్సర్, ఇతర వ్యాధులపై పోరాటం కేవలం ప్రభుత్వ బాధ్యత కాదు.. ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరం అన్నారు. ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో అందరం కలిసికట్టుగా ముందుకు సాగుదాం అని మంత్రి దామోదర పిలుపునిచ్చారు. కాగా, విధి నిర్వహణలో బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బందికి మంత్రి అవార్డులు అందజేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *