‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ను విజయవంతం చేయాలి

– మంత్రి సీతక్క ఆదేశాలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 5: ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క జిల్లా సీఈఓలు, డీపీఓలు, డీఆర్‌డీఓలకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమం అమలుపై సచివాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ పంచాయతీల్లో ప్రజా పాలన — ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని శుక్రవారం నుంచి ప్రారంభిస్తున్నామని తెలిపారు. 99 రోజులపాటు గ్రామాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి మౌలిక మార్పులు తీసుకురావాలని అధికారులకు సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమన్నారు. పనుల జాతరలో భాగంగా ప్రారంభించిన పనులను పూర్తి చేయాలని సూచించారు. మిషన్ భగీరథ ద్వారా అందుతున్న నీటిని వినియోగించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని గ్రామ సభల్లో తీర్మానాలు చేయించాలని తెలిపారు. గ్రామాల్లో బాల్య వివాహాల నిరోధంపై ప్రజల్లో అవగాహన కల్పించాలని మంత్రి సూచించారు. 2023-24లో చేపట్టిన పనులకు సంబంధించి రూ.245 కోట్లను ఆర్థిక సంఘం విడుదల చేసిందని, ఆ నిధులను ప్రధానంగా పారిశుధ్యం, తాగునీటి పనులకు వినియోగించాలని సూచించారు. ఆ సమయంలో పూర్తయిన ఇతర పనులకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. పారిశుధ్య నిర్వహణను మెరుగుపరచడం, ప్రభుత్వ సేవలు ప్రజలకు చేరువ చేయడం, గ్రామ అభివృద్ధిని వేగవంతం చేయడం, పెండింగ్ పన్నుల వసూళ్లు పెంచడం, తాగునీటి వనరుల పరిశీలన, వీధి దీపాల మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. కొత్త సర్పంచ్‌లు, వార్డు సభ్యుల్లో ఉన్న ఉత్సాహాన్ని వినియోగించుకోవాలని మంత్రి తెలిపారు. ప్రతి వారం చేపట్టిన పనులు, సాధించిన పురోగతిపై నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు. పనులపై ఆడిట్ కూడా నిర్వహిస్తామని మంత్రి తెలిపారు. 99 రోజులపాటు సిబ్బంది గ్రామాల్లో ఉండి ప్రజల అవసరాలు, సమస్యలు తెలుసుకోవాలని మంత్రి తెలిపారు. భవిష్యత్ విధానాల రూపకల్పనకు ఈ సమాచారం ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. కేరళలో కడు పేదరికాన్ని తగ్గించేందుకు ఇలాంటి సమాచార సేకరణ ఎంతో ఉపయోగపడిందని మంత్రి తెలిపారు. అదేవిధంగా ‘సెర్ప’ ద్వారా కడు పేదరికాన్ని గుర్తించి ఆర్థిక సహాయం అందించే కార్యక్రమాన్ని వచ్చే ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. కాన్ఫరెన్స్‌లో స్పెషల్ చీఫ్ సెక్రటరీ సంజయ్ కుమార్, పంచాయతీరాజ్ శాఖ డైరెక్టర్ దివ్య దేవరాజన్, మిషన్ భగీరథ ఈఎన్‌సీ కృపాకర్ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *