విజయోత్సవాలు కాదు.. ప్రజా వంచనోత్సవాలు

– కాంగ్రెస్‌ రెండేళ్ల పాలనలో హామీలన్నీ ఎగ్గొట్టారు
~ దమ్ముంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహించాలి
~ శాఖల వారీగా శ్వేతపత్రం విడుదల చేయాలి
– బీజేఎల్పీ నేత మహేశ్వర్‌ రెడ్డి డిమాండ్‌

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, డిసెంబర్‌ 5: ఇచ్చిన హామీలను రెండేళ్లుగా అమలు చేయకుండా ప్రజాపాలన విజయోత్సవాలంటూ రేవంత్‌ రెడ్డి సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటు అని బీజేఎల్పీ నేత అల్లేటి మహేశ్వర్‌రెడ్డి తీవర్రగా విమర్శించారు. హామీలు ఎగ్గొట్టి ప్రజలను నిలువెల్లా దగా చేసిన కాంగ్రెస్‌ సర్కారుకు విజయోత్సవాలు చేసుకునే అర్హత లేదన్నారు. ప్రజలను వంచించినందుకు సీఎం రేవంత్‌ రెడ్డి ముందుగా క్షమాపణలు చెప్పి ముక్కు నేలకు రాయాలని డిమాండ్‌ చేశారు. ఏ మొహం పెట్టుకుని సీఎం రేవంత్‌ రెడ్డి జిల్లాల్లో పర్యటిస్తూ సర్పంచ్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అనుకూలురను గెలిపించాలని ప్రచారం చేస్తున్నారని నిలదీశారు. రేవంత్‌ రెడ్డికి దమ్ముంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహించాలని, అపుడు నమ్మించి మోసం చేసిన కాంగ్రెస్‌ను జనం బొందపెట్టడం ఖాయం అని అన్నారు. కాంగ్రెస్‌ మేనిఫెస్టో అభయ హస్తంలో ఇచ్చిన 420 హామీల్లో ఎన్నింటిని అమలు చేశారో ప్రజలకు వివరించే దమ్ముందా అని ముఖ్యమంత్రికి సవాల్‌ విసిరారు. దమ్ముంటే శాఖల వారీగా శ్వేతపత్రం విడుదల చేయాలని, మంత్రులంతా తమ శాఖల్లో ఇచ్చిన హామీల్లో అమలు చేసిన అంశాలపై ప్రజలకు శ్వేతపత్రాల రూపంలో వివరణ ఇవ్వాలని మహేశ్వర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక 2023 డిసెంబర్‌ 7న రేవంత్‌ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశాక అభయ హస్తం ఫైలుపైనే తొలి సంతకం చేశారని, కేబినెట్‌ తొలి భేటీలో కూడా అభయహస్తం ఆరు గ్యారంటీల కార్డుకు చట్టబద్ధత కల్పించాలని నిర్ణయించి, దానికి చట్టబద్దత కల్పించకుండా అటకెక్కించి ప్రజలను మోసం చేసినందుకా విజయోత్సవాలు నిర్వహించేది? మార్పు తమతోనే సాధ్యమన్న కాంగ్రెస్‌ తన పాలనలో ఏ రంగంలోనూ మార్పు సాధించకుండా మరింత దిగజారుస్తూ రాష్ట్ర పరిస్ధితిని పెనం నుంచి పొయ్యిలో పడిన విధంగా మార్చినందుకా అని ఆయన నిలదీశారు. బీఆర్‌ఎస్‌ పాలనలో కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్‌ భగీరధ పథకాల్లో అవినీతిని వెలికితీసి కేపసీఆర్‌, కేటీఆర్‌, హరీష్‌రావులను దోషులుగా నిలబెడతామని, వారు దోచుకున్న అవినీతి సొమ్మును కక్కిస్తామని చెప్పి అవేమీ చేయకుండా వారితో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ చేసుకుని సగం సొమ్మును కొట్టేశారని, ఆ స్కాములేకాక ఫోన్‌ ట్యాపింగ్‌, ఫార్ములా ఈ-రేసింగ్‌, ధరణి అక్రమాలపై ఇప్పటివరకు గత ప్రభుత్వ పెద్దలపై ఒక్క కేసు కూడా నమోదు చేయకుండా బీఆర్‌ఎస్‌తో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ చేసుకున్నందుకా ఈ విజయోత్సవాలు అని అడిగారు. రెండేళ్ల పాలనలో సీఎం రేవంత్‌ రెడ్డితోపాటు ఆయన కోటరీ, మంత్రులు, కొందరు పార్టీ నేతలు అవినీతికి పాల్పడుతూ వేల కోట్లు వెనకేసుకుంటున్నందుకా అని ఆయన ప్రశ్నించారు. పారిశ్రామికవాడల్లోని 9,292 ఎకరాల భూములను కొల్లగొట్టే హిల్ట్‌ పాలసీ జీవో-27 బయటకు ఎలా వచ్చిందని విచారణ నిర్వహించడానికి సీఎం రేవంత్‌ రెడ్డికి సిగ్గుండాలి అని అన్నారు. ఆ జీవో బయటకు రాకుంటే గుట్టుచప్పుడు కాకుండా రూ.6లక్షల 29 వేల కోట్ల స్కామ్‌ కు పాల్పడుదామనుకున్నారని ఆరోపించారు. హిల్ట్‌ పాలసీ మాదిరిగా ఇంకా భూములను కొల్లగొట్టేలా ఉన్న జీవోలన్నింటినీ పబ్లిక్‌ డొమైన్‌లో పెట్టాలని, ఇప్పటివరకు ప్రభుత్వం శాఖల వారీగా జారీ చేసిన జీవోలన్నింటినీ పబ్లిక్‌ డొమైనులో పెట్టాలని డిమాండ్‌ చేశారు. రెండేళ్ల పాలనలోనే వేల కోట్ల అవినీతికి పాల్పడినందుకు, పేద రైతుల నుంచి బలవంతంగా భూములను లాక్కుంటున్నందుకు రేవంత్‌ రెడ్డిని ఇకనుంచి రాబందు రెడ్డి అని పిలవాలన్నారు. తక్షణమే ప్రభుత్వం ప్రజా విజయోత్సవాలను రద్దు చేయాలని, హామీలను అమలు చేయనందుకు ప్రజలకు క్షమాపణలు చెప్పాలని, హామీలను ఎప్పటిలోగా అమలు చేస్తారో స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలని మహేశ్వర్‌రెడ్డి ముఖ్యమంత్రిని డిమాండ్‌ చేశారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *