– అభివృద్ధి, సంక్షేమ పథకాలకే పట్టం
– సన్న బియ్యంతో సంచలన విజయాలు
– పేదల కళ్లల్లో వెలుగులు నింపిన తెల్ల కార్డులు
– మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి
సూర్యాపేట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 13: పురపాలక సంఘం ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయాలు ప్రభుత్వ పనితీరును ప్రతిబింబింప చేస్తున్నాయని నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సన్న బియ్యం పంపిణీ ఈ ఎన్నికల్లో గేమ్ చెంజర్ గా మారిందని చెప్పారు. పురపాలక సంఘాల ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం ఆయన స్పందిస్తూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక జరుగుతున్న అభివృద్ధి, అమలవుతున్న సంక్షేమ పథకాలకు ప్రజామోదం లభించినట్లైందని ఆయన అన్నారు. అర్హులైన నిరుపేదలకు తెల్ల రేషన్ కార్డుల పంపిణీతోపాటు రాష్ట్ర జనాభాలో 85% ప్రజలకు ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న నాణ్యమైన సన్న బియ్యం పంపిణీ వంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలు, మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్ళు, అర్హులైన నిరుపేద మధ్యతరగతి వర్గాలకు ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తున్న 200 యూనిట్ల విద్యుత్ సరఫరా వంటి పధకాలు కాంగ్రెస్ విజయానికి దోహదం చేశాయన్నారు. వీటన్నింటిని మించి సాగునీటి రంగంలో సాధించిన విజయాలు, దేశ చరిత్రలోనే రికార్డ్ స్థాయిలో ధాన్యం దిగుబడులు, అదే స్థాయిలో కొనుగోళ్ల ప్రక్రియతోపాటు రైతాంగానికి అనుకూల ప్రభుత్వ విధానాలు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేశాయన్నారు. మొత్తంగా ప్రభుత్వ పనితీరును పట్టణ ప్రజలు ఆమోదించి పట్టం కట్టారన్నారు. ఈ ఫలితాలు ముందుగా ఊహించినవేనని, యావత్ తెలంగాణా సమాజం కాంగ్రెస్ పార్టీ వెంట నడుస్తోందనడానికి ఈ ఎన్నికల అద్దం పడుతున్నాయన్నారు. పల్లెలతోపాటు పట్టణాలు సైతం కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై ప్రజలిచ్చిన తీర్పు గా ఆయన అభివర్ణించారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూర్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని హుజుర్నగర్, నేరేడుచర్లతో పాటు కోదాడ, సూర్యాపేట పురపాలక సంఘాల ఫలితాలపై ఆయన స్పందిస్తూ సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీకీ కంచుకోట అని మరోమారు రుజువైనందన్నారు. ఈ విజయం పూర్తిగా కార్యకర్తల కష్టంతో సాధించిందంటూ అందుకు తోడ్పాటునందించిన ఆయా పురపాలక సంఘాల ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. 2023 శాసనసభ ఎన్నికల్లో సూర్యాపేట జిల్లాలో కాంగ్రెస్ పార్టీ సాధించిన సంచలన విజయాల వొరవడి ఆ తరువాత జరిగిన లోకసభ ఎన్నికల్లో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో, తాజాగా పురపాలక సంఘాల ఎన్నికల్లోనూ కొనసాగిందని ఆయన వ్యాఖ్యానించారు. లోక్‌సభ ఎన్నికల్లో సూర్యాపేట జిల్లాలోనీ తుంగతుర్తి, సూర్యాపేట,కోదాడ,హుజుర్నగర్ నియోజకవర్గలలో కాంగ్రెస్ సాధించిన ఓట్లు భారతదేశ చరిత్రలోనే ప్రత్యేక రికార్డ్ గా నమోదయిందని గుర్తు చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





