– అడ్వొకేట్స్ ప్రొటెక్షన్ బిల్లుపై మంత్రి శ్రీధర్‌బాబు
హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 30: న్యాయ వ్యవస్థలో న్యాయవాదుల పాత్ర కీలకమని, వారిపై దాడులు నిత్యకృత్యమయ్యాయని, ఇది బాధాకరమని, వారి రక్షణ మనందరి బాధ్యత అని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. గత బీఆరఎస్ ప్రభుత్వ హయాంలో మంథని నియోజకవర్గం రామగిరి మండలంలో పట్టపగలే న్యాయవాది గట్టు వామనరావు దంపతులను అతి కిరాతకంగా హత్య చేశారని గుర్తు చేశారు. ఇప్పటికీ అసలు దోషులను గుర్తించలేదని, సీబీఐ విచారణ ఇంకా కొనసాగుతోందని తెలిపారు. అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వ పెద్దల డైరెక్షన్‌లో పోలీసులు వామనరావు దంపతుల కేసును నీరుగార్చారని ఆయన ఆరోపించారు. అసలు దోషుల్ని తప్పించేలా విచారణను తప్పుదోవ పట్టించారని, ఈ ఘటన తర్వాతి నుంచి తమ రక్షణ కోసం ఓ ప్రత్యేక చట్టం కావాలని న్యాయవాదులు డిమాండ్ చేస్తున్నారని చెప్పారు. అయినా గత ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. న్యాయవాదులపై దాడులు జరిగినా స్పందించలేదన్నారు. తమ ప్రభుత్వం న్యాయవాదుల సంరక్షణకు కట్టుబడి ఉందని, అందుకే ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణ అడ్వకేట్స్ ప్రొటెక్షన్ బిల్లును సభలో ప్రవేశపెట్టామని చెప్పారు. ఒక న్యాయవాదిగా ఇది తనకు సంతృప్తినిచ్చే అంశమని శ్రీధర్‌బాబు అన్నారు.
మండలిలో బీఆర్‌ఎస్ సభ్యులకు శ్రీధర్‌బాబు కౌంటర్
సభా నిర్వహణలో చైర్మన్‌కి సహకరించాల్సిన బాధ్యత ప్రతి సభ్యుడిపై ఉంటుందని, చైర్‌ను డిక్టేట్ చేసేలా వ్యవహరించడం తగదని బీఆరఎస్ సభ్యులకు మంత్రి శ్రీధర్‌బాబు హితవు పలికారు. మండలిలో బీఆరఎస్ సభ్యుల తీరు అప్రజాస్వామికంగా ఉందన్నారు. ప్రతి విషయాన్ని ప్రజలు నిశితంగా పరిశీలిస్తున్నారని మర్చిపోవద్దన్నారు. ఇది పెద్దల సభ అని, తమ రాజకీయాల కోసం సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగించడం సరికాదని అన్నారు. ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. 2014 నుంచి జరిగిన మైనింగ్ అక్రమాలపై సీబీసీఐడీతో విచారణ చేయిస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించిందని, అయినా హౌజ్ కమిటీ పేరిట మండలిలో కూడా బీఆర్‌ఎస్ సభ్యులు రాజకీయం చేయడం సిగ్గుచేటని అన్నారు. 2014-18 మధ్య బీఆరఎస్ ప్రభుత్వం మూడు హౌజ్ కమిటీలను వేసింది కానీ సక్రమంగా సమావేశాలు నిర్వహించలేదని, నివేదికలు బయటకు ఇవ్వలేదని అన్నారు. పదేళ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్‌ఎస్‌కు సీబీసీఐడీపై నమ్మకం లేకపోవడం శోచనీయమని ఎద్దేవా చేశారు.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





