పీ అండ్ ఆర్‌లో సుదీర్ఘ కాలం తర్వాత పదోన్నతులు

– 27మంది డిప్యూటీ సీఈవోలకు సీఈవోలుగా
– 55మంది ఎంపీడీవోలకు డిప్యూటీ సీఈవోలుగా
– ప్రజా భవన్‌లో మంత్రి సీతక్కను సన్మానించిన అధికారులు
– మాది ఉద్యోగ ఫ్రెండ్లీ ప్రభుత్వం అని స్పష్టం చేసిన సీతక్క

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 20: పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పదోన్నతులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క చొరవతో ఈ ప్రక్రియ వేగవంతం కాగా సంబంధిత ఉత్తర్వులను ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్.శ్రీధర్ జారీ చేశారు. ఈ నిర్ణయం ప్రకారం 27మంది డిప్యూటీ సీఈవోలు సీఈవోలుగా పదోన్నతి పొందగా, 55మంది ఎంపీడీవోలు డిప్యూటీ సీఈవోలుగా పదోన్నతి పొందారు. పదోన్నతులు పొందిన అధికారులు ప్రజా భవన్‌లో శుక్రవారం మంత్రి సీతక్కను కలిసి సన్మానించారు. సుదీర్ఘకాలం తర్వాత పదోన్నతులు కల్పించినందుకు ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రికి స్వీట్లు తినిపించి తమ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం ఉద్యోగ ఫ్రెండ్లీ ప్రభుత్వం.. ఉద్యోగాల భర్తీతోపాటు, అర్హత కలిగిన వారికి సమయానుకూలంగా పదోన్నతులు కల్పించడం ప్రభుత్వ ధ్యేయం అని స్పష్టం చేశారు. శాఖ బలోపేతం కావడం ద్వారా ప్రజలకు మరింత చేరువగా, సమర్థవంతమైన సేవలు అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. అదేవిధంగా ఖాళీగా ఉన్న 28 ఎంపీడీవో పోస్టుల నుంచి డిప్యూటీ సీఈవోలుగా, 15మంది డిప్యూటీ సీఈవోల నుంచి సీఈవోలుగా పదోన్నతులు కల్పించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని మంత్రి హామీ ఇచ్చారు. ఎంపీడీవోల నుంచి అటెండర్‌ల వరకు ఖాళీగా ఉన్న అన్ని పోస్టుల్లో దశలవారీగా పదోన్నతులు కల్పిస్తామని తెలిపారు. ప్రజా ప్రభుత్వంలో మొదటిసారిగా అత్యధిక స్థాయిలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలో పదోన్నతులు కల్పించడం ద్వారా శాఖను బలోపేతం చేసినట్టు మంత్రి పేర్కొన్నారు. ఈ చర్యలతో గ్రామీణ స్థాయిలో పరిపాలన మరింత మెరుగుపడుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
కార్యక్రమంలో టీజీవో అధ్యక్షుడు ఏలూరు శ్రీనివాస్ రావు, సీఈవో, డిప్యూటీ సీఈవో అసోసియేషన్ ఉపాధ్యక్షుడు కొంపల్లి నర్సింహులు, ఎంపీడీవో అసోసియేషన్ ప్రతినిధులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *