ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?

– అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీసిన హరీశ్ రావు

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 23: ఎన్నికల ముందు ఆర్టీసీ ఉద్యోగులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక గాలికొదిలేసిందని బీఆర్ఎస్ నేత హరీష్‌రావు మండిపడ్డారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు, సంస్థ మనుగడపై ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మొన్నటి గవర్నర్ ప్రసంగంలో మహిళలకు ఉచిత ప్రయాణం వల్ల రూ.9,200 కోట్లు ఆదా అయిందని ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంది. మరి ఆ రూ.9,200 కోట్లను ప్రభుత్వం ఆర్టీసీకి చెల్లించిందా లేదా? ఒకవేళ ఇంకా చెల్లించకపోతే ప్రభుత్వం ఆర్టీసీకి ఎంత బాకీ ఉందో రవాణా శాఖ మంత్రి స్పష్టంగా చెప్పాలని నిలదీశారు. ప్రస్తుతం ఆర్టీసీ లాభాల్లో ఉందా? నష్టాల్లో ఉందా అని కూడా ప్రశ్నించారు. ఒకవేళ సంస్థ లాభాల్లోనే ఉంటే కార్మికులకు చెల్లించాల్సిన బెనిఫిట్స్, ఎరియర్స్, సీసీఎస్ బకాయిలను ఎందుకు ఇవ్వడం లేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు కొత్త పీఆర్సీ బకాయి ఉండి మూడేళ్లు అవుతోంది. వారు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ఆ కొత్త పీఆర్సీని ఎప్పటినుంచి అమలు చేస్తారో స్పష్టం చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో ఆర్టీసీ యూనియన్లను పునరుద్ధరిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చిందని, దాన్ని ఎప్పటిలోగా అమలు చేసి యూనియన్లను పునరుద్ధరిస్తారో మంత్రి సూటిగా చెప్పాలని నిలదీశారు. గత బీఆరఎస్ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ నిర్ణయం తీసుకుని గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ చేసిందని గుర్తు చేశారు. మరి ఆ ఉద్యోగులను ఏ డేట్ ఆఫ్ అపాయింట్‌మెంట్ నుంచి ప్రభుత్వ ఉద్యోగులుగా ఈ ప్రభుత్వం గుర్తిస్తుందో తేల్చి చెప్పాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా చాలా నియోజకవర్గాల్లో, సిద్దిపేట సహా పలు డిపోల్లో బస్సుల సంఖ్య దారుణంగా తగ్గిపోయింది.. కొత్త బస్సులు వేయాలని ప్రజలు అడుగుతుంటే తమ దగ్గర సరిపడా బస్సులు లేవు అని డిపో మేనేజర్లు చేతులెత్తేస్తున్నారు., ట్రాఫిక్ రద్దీకి అనుగుణంగా కొత్త బస్సులు ఇచ్చే ఆలోచన ప్రభుత్వానికి ఉందా.. ఇప్పటికే కాలం చెల్లిన పాత బస్సుల స్థానంలో కొత్త బస్సులను ఎప్పుడు ఇస్తారో చెప్పాలి అని హరీష్‌రావు మంత్రిని ప్రశ్నించారు. ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చాల్సిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందన్నారు. దాటవేత ధోరణి మాని కార్మికుల న్యాయమైన డిమాండ్లను, బస్సుల కొరత సమస్యను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *