-అమలు కోసం ఉద్యమం చేపడతామని సీఎంకు లేఖ
-బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు
హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 9: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 18 నెలలు గడుస్తున్నాదివ్యాంగుల సంక్షేమం, అభివృద్ధి కోసం కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న హామీలు అమలుకాకపోవడం వల్ల ఆయా వర్గాల్లో తీవ్ర అసంతృప్తి నెలకొందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచంద్రరావు పేర్కొన్నారు. ఈమేరకు సీఎం రేవంత్‌రెడ్డికి ఆయన లేఖ రాశారు. దివ్యాంగుల పెన్షన్‌ను రూ.6,000కి పెంచుతామని, 80శాతం పైబడి వైకల్యం ఉన్న వారికి రూ.15,000 ఆర్థిక సాయం అందిస్తామని, చేయూత కింద వితంతువులు, వృద్ధులు, ఒంటరి మహిళలకు ఇచ్చే నెలవారీ పెన్షన్ రూ.4,000కి పెంచుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కానీ ఇప్పటికీ అవి అమలులోకి రాకపోవడం వల్ల వారి జీవితాల్లో ఆర్థిక భద్రత కరువైందని ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తగా దరఖాస్తు చేసిన దివ్యాంగుల పెన్షన్ల మంజూరులో జరుగుతున్న జాప్యం ప్రభుత్వ చిత్తశుద్ధిపై అనుమానాలకు తావిస్తోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దివ్యాంగుల ఆర్థిక, సామాజిక సమస్యలను దృష్టిలో ఉంచుకుని వాటి తక్షణ పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవాలని బీజేపీ తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో దివ్యాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించేందుకు చట్ట సవరణ లేదా ఆర్డినెన్స్ తీసుకురావాలని, దివ్యాంగులకు ప్రభుత్వ శాఖలలో 4శాతం ఉద్యోగ రిజర్వేషన్ తక్షణమే అమలు చేయాలని, ఎస్‌జీడీ జీవో విడుదల చేసి క్యారీ ఫార్వర్డ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. అలాగే దివ్యాంగుల శాఖకు స్వతంత్రత కల్పించి అన్ని జిల్లాల్లో పూర్తిస్థాయి సిబ్బందిని నియమించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత రవాణా, ఆర్టీసీలో 4% బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ, వ్యాపార సముదాయాల్లో 5% రిజర్వేషన్ అమలు చేయాలని, యాదగిరిగుట్ట దేవస్థానం ఆధ్వర్యంలో వైఆర్‌ఆర్‌డీ ట్రస్టు ఏర్పాటుకు స్థలం, నిధులు కేటాయించాలని కూడా డిమాండ్ చేశారు. ఐకేపీ, మెప్మా ద్వారా స్వయం సహాయక సంఘాలకు రుణమాఫీ, పునరుద్ధరణ, ప్రోత్సాహకాలు కల్పించాలన్నారు. మేనిఫెస్టోలో ప్రకటించిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణం అమలు చేయాలని, లేకుంటే రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ మరో ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుడుతుందని రామచంద్రరావు హెచ్చరించారు.


