– ఎస్.ఎల్.బి.సి టన్నెల్ పనుల కోసం ప్ర‌త్యేక విభాగం
– నిధుల కేటాయింపున‌కు సీఎం ఓకే
– పూడిక‌తీత ప‌నుల‌కు ప్రాధాన్యం
– కాళేశ్వ‌రం పున‌రుద్ధ‌ర‌ణ డిజైన్లు నెల‌లోపు పూర్తి
– మంత్రి కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి

హైద‌రాబాద్‌, ప్ర‌జాతంత్ర‌, జ‌న‌వ‌రి 21: రాష్ట్రంలో ప్రధాన ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పధకం పనులు శరవేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖామంత్రి కెప్టెన్ ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు.  రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న నీటిపారుదల ప్రాజెక్టుల పురోగతిపై బుధవారం రోజున డాక్టర్ బి.ఆర్.అంబెడ్కర్ సచివాలయంలో నీటిపారుదల అధికారులతో ఆయన ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పధకంతో పాటు నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల పురోగతి పై తరచూ సమీక్షించుకుని పనుల వేగవంతానికి చర్యలు తీసుకోవాలన్నారు.  రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఎస్.ఎల్.బి.సి టన్నెల్ పనులను కొనసాగించడానికి గాను ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు  ప్రకటించారు. ప్రమాదవశాత్తు జరిగిన ఘటనలో టన్నెల్ లో చిక్కుకున్న టన్నెల్ బోరింగ్ మెషీన్ శకలాలను పూర్తిగా తొలగించామని,ప్రస్తుతం టన్నెల్ లో రైలు ట్రాక్ సహాయంతో మరమ్మతులు కొనసాగుతున్నాయన్నారు. ప్రాజెక్టుల పనులలో నిబంధనలు పాటిస్తూనే నాణ్యతాప్రమాణాలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన అధికార్ల‌కు సూచించారు.  నీటిపారుదల ప్రాజెక్టుల పూర్తికి సరిపడా నిధుల కేటాయింపును ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అంగీకరించారని,యుద్దప్రాతి పదికన పూర్తికి అధికారులు చొరవ తీసుకోవాలని ఆయన సూచించారు. నిర్మాణాల విషయంలో అధికారులు బాధ్య‌తాయుతంగా ప్రవర్తించాలని, అలక్ష్యం ప్రదర్శిస్తే ప్రభుత్వం ఏ మాత్రం ఉపేక్షించబోదని ఆయన స్పష్టం చేశారు. తుమ్మిడిహట్టి వద్ద ప్రభుత్వ నిర్ణయం మేరకు నిర్మించ తలపెట్టిన బ్యారేజ్ కు సంబంధించిన డి.పి.ఆర్ తయారీ కోసం పూర్తి స్థాయిలో సర్వేలు, పరిశోధనలు వేగవంతంగా కొనసాగుతున్నాయన్నారు. బ్యారేజ్ ప్రాంతంలో అవసరమైన 73 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో టోపోగ్రాఫికల్ సర్వే పూర్తిఅయిందని,దానితో పాటు 85 కిలోమీటర్ల కాలువ సర్వేను కుడా పూర్తి చేశామన్నారు. అదనంగా వార్ద, వైన్ గంగా నదులకు ఇరువైపులా క్రాస్-సెక్షన్ లెవల్స్ సర్వే పూర్తి అయినందున డి.పి.ఆర్ లకు తుదిరూపం ఇచ్చేందుకు కసరత్తు వేగంగా పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన బ్యారేజ్ లకు సంబంధించిన పూణేకు చెందిన సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్ మెడిగడ్డ, అన్నారం,సుందిళ్ళ బ్యారేజ్ లపై సైట్ తనిఖీ నివేదికతో పాటు పనులకు సంబందించిన ప్రణాళికాలు సమర్పించిందని ఆయన వివరించా రు.బుధవారం రోజున మెడిగడ్డ బ్యారేజ్ వద్ద ముగ్గురు సభ్యులతో కూడిన బృందం అధ్యయనం ప్రారంభించగా మరో ఇద్దరు సభ్యులు బోర్ హోల్ ప్రాంతాలను పరిశీలించిన‌ట్టు తెలిపా రు.అన్నారం,సుందిళ్ళ బ్యారేజ్ ల వద్ద పరిశీలన పనులు ఈ నెల 22 న ప్రారంభం కానున్నాయన్నారు.ఈ మూడు బ్యారేజ్ ల పునరుద్ధరణ డిజైన్లు  నెల వ్యవధిలో రూపొందించాలని అధికార్ల‌ను ఆదేశించారు.  అదేవిధంగా నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణానికి గాను పర్యావరణ అనుమతులు పొందేందుకు మరింత ఒత్తిడిని పెంచాలన్నారు.పర్యావరణ అనుమతులకు అనుమతిస్తూ సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన ఆదేశాలను ఆయన ఈ సందర్భంగా ఉటంకించారు.ఇదే విషయాన్ని కేంద్ర జలశక్తి మంత్రి దృష్టికి ఇప్పటికే ఇసుకొచ్చామని,ముఖ్యమంత్రితో చర్చించి ప్రధానమంత్రి దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. అన్నింటికీ మించి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రాజెక్టులలో మట్టి,ఇసుక మెటలతో పుడుకుపోయాయని, దానితో నీటి నిలువ సామర్ధ్యం తగ్గిపోతున్న దృష్ట్యా ప్రభుత్వం ప్రత్యేకించి ప్రాజెక్టులలో పూడికతీత పనులకు శ్రీకారం చుట్టిందని చెప్పారు. ప్రత్యేకంగా రాష్ట్రంలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టును ప్రస్తావిస్తూ వరుసగా సంభవిస్తున్న వరదలతో మట్టి, ఇసుక వచ్చి చేరడంతో 112 టి.యం.సి ల సామర్ధ్యం కాస్త 90 టి.యం.సి లకు పడిపోయిందన్నారు. ఈ సమస్య పరిష్కారానికి తక్షణ చర్యలు తోసుకోవలసిన ఆవశ్యకతను మంత్రి ఉత్తమ్ అధికారులను ఆదేశించారు. స‌మావేశంలో నీటిపారుదల శాఖ‌ ప్రధాన కార్యదర్శి రాహుల్ బొజ్జా,సహాయ కార్యదర్శి కే.శ్రీనివాస్, ఇ.ఎన్.సి లు, చీఫ్ ఇంజినీర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లు పాల్గొన్నారు.

——————————————————————————————————————————————————————————————-

తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.