టీబీ రోగుల కోసం ‘ప్రాజెక్ట్ ఓజాస్’

– ప్రారంభించిన కేర్ హాస్పిటల్స్

హైదరాబాద్, ప్ర‌జాతంత్ర‌, మార్చి 2: దేశంలో టిబి (క్షయ వ్యాధి) నిర్మూలన లక్ష్యాన్ని సాధించేందుకు కేర్ హాస్పిటల్స్, జగతి ఫౌండేషన్ కలిసి ప్రాజెక్ట్ ఓజాస్ అనే ప్రధాన సిఎస్ఆర్ కార్యక్రమాన్ని ప్రారంభించాయి. హైదరాబాద్‌లో టిబి రోగులకు నిరంతర పోషకాహారం,  మానసిక సహాయం అందించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం. ఇది కేంద్ర ప్రభుత్వ “ప్రధాన్ మంత్రి టిబి ముక్త్ భారత్ అభియాన్” కు అనుసంధానించారు. ఈ కార్యక్రమాన్ని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన దాసరి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా టిబి రోగులకు ప్రత్యేకంగా సిద్ధం చేసిన పోషకాహార కిట్లను పంపిణీ చేశారు. ‘ప్రాజెక్ట్ ఓజాస్’ ద్వారా రాబోయే ఆరు నెలల్లో దాదాపు 3,000 మంది టిబి రోగులకు సహాయం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రతి రోగికి రోగనిరోధక శక్తి పెంచే పోషకాహార రేషన్ కిట్లు, శక్తిని పెంపొందించే ఆరోగ్య పదార్థాలు, అవసరమైన శుభ్రత సామగ్రి, అలాగే కౌన్సెలింగ్, మానసిక ధైర్యం అందజేస్తారు. దీని ద్వారా రోగులు చికిత్సను పూర్తి చేసేలా ప్రోత్సాహం లభిస్తుంది. ఈ సందర్భంగా కలెక్టర్ హరిచందన మాట్లాడుతూ టిబి నిర్మూలనకు ప్రభుత్వం, ప్రైవేట్ ఆసుపత్రులు, స్వచ్ఛంద సంస్థలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. మందులతోపాటు సరైన పోషకాహారం, కౌన్సెలింగ్ కూడా అవసరమని తెలిపారు. కేర్ హాస్పిటల్స్, జగతి ఫౌండేషన్ ముందుకు వచ్చి జిల్లా పరిపాలనకు తోడ్పడటం అభినందనీయమని పేర్కొన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య అధికారి డాక్టర్ జె.వెంకటి మాట్లాడుతూ టిబి రోగుల్లో బరువు తగ్గడం, శరీర బలహీనత ఎక్కువగా ఉంటుందని చెప్పారు. సరైన పోషకాహారం అందితే కోలుకునే వేగం పెరుగుతుందని తెలిపారు.

ఆరోగ్య సేవలు హాస్పిట‌ల్‌ గోడలకే పరిమితం కాకూడదు

కేర్ హాస్పిటల్స్ సీఈఓ డాక్ట‌ర్‌ పవన్ కుమార్ మాట్లాడుతూ ఆరోగ్య సేవలు ఆసుపత్రి గోడలకే పరిమితం కాకూడదన్నారు. టిబి వంటి వ్యాధులతో పోరాడుతున్న పేద రోగులకు పోషకాహారం, కౌన్సెలింగ్, నిరంతర ఫాలోఅప్ అవసరమని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా రోగుల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించడం లక్ష్యమన్నారు. కేర్ హాస్పిటల్స్ చీఫ్ ఆఫ్ మెడికల్ సర్వీసెస్ డాక్టర్ నిఖిల్ మాథుర్ మాట్లాడుతూ టిబి శరీర రోగ నిరోధక శక్తిని బలహీనపరుస్తుందని చెప్పారు. మందులతోపాటు పోషకాహారం ఉంటేనే పూర్తిగా కోలుకోవడం సాధ్యమవుతుందన్నారు. జిల్లా టిబి కంట్రోల్ అధికారి డాక్టర్ చల్లా దేవి మాట్లాడుతూ టిబి చికిత్సను పూర్తిగా ముగించడం అత్యంత ముఖ్యమని, పోషకాహారం, మానసిక సహాయం ఉంటే రోగులు మధ్యలో మందులు ఆపకుండా పూర్తి చేసే అవకాశాలు పెరుగుతాయని తెలిపారు. జగతి ఫౌండేషన్ స్థాపకురాలు దుర్గా కళ్యాణి మాట్లాడుతూ ‘ప్రాజెక్ట్ ఓజాస్’ ద్వారా టిబి రోగుల శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడేలా కృషి చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్యంతో రోగి కేంద్రంగా ఈ కార్యక్రమం కొనసాగనుందని తెలిపారు. టిబి రోగులు చికిత్సను మధ్యలో ఆపకుండా పూర్తి చేయడం, త్వరగా కోలుకోవడం ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. కేర్ హాస్పిటల్స్ సంస్థ భవిష్యత్తులో కూడా నివారణ ఆరోగ్యం, ముందస్తు పరీక్షలు, బలహీన వర్గాలకు సహాయం వంటి సుస్థిర సిఎస్ఆర్ కార్యక్రమాలను కొనసాగిస్తామని వెల్లడించింది. కార్యక్రమంలో నాంపల్లిలోని కేర్ హాస్పిటల్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ శశికాంత్ అగ్సారే, సీనియర్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ డాక్టర్ ఫైజాన్ అజీజ్‌, నాంపల్లిలోని కేర్ హాస్పిటల్స్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఆశిష్ మాథుర్ పాల్గొన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *