హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 29: సుప్రసిద్ధ కవి, విమర్శకులు, పరిశోథకులు, తెలుగు విశ్వవిద్యాలయం పూర్వ ఉపకులపతి ప్రొఫెసర్ ఎస్వీ సత్యనారాయణకు తొలి తెలుగు భాషా శాస్త్రవేత్త, వ్యావహారిక భాషా ఉద్యమకారుడు గిడుగు రామ్మూర్తి పంతులు జాతీయ జీవన సాఫల్య పురస్కారాన్ని ఈ నెల 31న ఉదయం 10.30 గంటలకు రవీంద్ర భారతిలో ప్రదానం చేయనున్నట్టు గిడుగు రామ్మూర్తి పంతులు ఫౌండేషన్ అధ్యక్షుడు బిక్కి కృష్ణ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. గిడుగు రామ్మూర్తి పంతులు జయంతి సందర్భంగా యేటా ప్రతిభావంతులైన కవులకు, సాహితీవేత్తలకు అందజేసే జీవన సాఫల్య పురస్కారానికి ఈయేడాది (2025) ప్రొఫెసర్ ఎస్వీ సత్యనారాయణ ఎంపికయ్యారని తెలిపారు. ఎస్వీ అన్న సంక్షిప్త నామంతో ప్రఖ్యాతులైన ఆయన 30 గ్రంథాలను రచించారు. మరో 34 గ్రంథాలకు సంపాదకత్వం వహించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యక్షునిగా, ఆర్ట్స్ విభాగం డీన్‌గా, ఆర్ట్స్ కళాశాల ప్రధానాచార్యులుగా బాధ్యతలు నిర్వహించిన ప్రొఫెసర్ ఎస్వీ తెలుగు విశ్వవిద్యాలయం పదవ ఉపకులపతిగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారన్నారు. వారి హయాంలోనే బాచుపల్లిలో అత్యాధునిక సౌకర్యాలతో బాలుర వసతి గృహం నిర్మించబడిరది. ‘హలో విద్యార్థీ చలో క్లాస్‌రూం’ అంటూ ఆయన ఇచ్చిన నినాదం బహుళ ప్రజాదరణ పొందిందని గుర్తుచేశారు. గతంలో ఒక పర్యాయం కేంద్ర సాహిత్య అకాడమీ జనరల్ కౌన్సిల్ సభ్యులుగా ఉన్న ఎస్వీ ప్రస్తుతం రెండవ పర్యాయం ఆ బాధ్యతల్లో కొనసాగుతున్నారు. సరిగమలు, జీవజ్వాల, యుద్ధం జరుగుతూనే ఉంది, జీవితం ఒక ఉద్యమం, ఉద్యమం ఉద్యమమే వంటి కవితా సంపుటులను- తెలుగులో ఉద్యమ గీతాలు, దృక్పథాలు, సత్యానుశీలన మొదలైన ప్రామాణిక పరిశోధన గ్రంథాలను రచించిన ఎస్వీ; దళితవాద వివాదాలు, స్త్రీవాద వివాదాలు; గ్లోబలైజేషన్ కథలు, ప్రపంచీకరణ ప్రతిధ్వని వంటి ఉత్తమ గ్రంథాలకు సంపాదకత్వం వహించారు. అనేక మంది ప్రముఖుల జీవిత చరిత్రలను గ్రంథస్తం చేశారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ అధ్యాపక పురస్కారం, ముఖ్దూం జాతీయ పురస్కారం, శ్రీశ్రీ స్వర్ణ పతకం, తుమ్మల పురస్కారం మొదలైన 30కి పైగా సాహితీ సత్కారాలు, పురస్కారాలు పొందిన ప్రొఫెసర్ ఎస్వీ సత్యనారాయణ సాహిత్య, సాంస్కృతిక, పరిశోధన, పరిపాలనారంగాలకు చేస్తున్న విశిష్టమైన కృషికి గుర్తింపుగా ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తున్నట్టు ఆయన తెలిపారు.
—————————
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.



