ముగిసిన ప్రొఫెసర్‌ కుంభం అంత్యక్రియలు

– ప్రత్యేక తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమంలో కీలక పాత్ర
– పూర్తి సాధికారత కలిగిన తెలంగాణ తొలితరం మేధావి
– ఉద్యమంలో ధూం ధామ్‌లతో ప్రజల్లో చైతన్యం తెచ్చిన వ్యక్తి
– నల్లగొండ జిల్లా మర్రిగూడ శివన్నగూడలో విషాద ఛాయలు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూలై 23: నారాయణగూడలోని తన స్వగృహంలో మంగళవారం కన్నుమూసిన ప్రముఖ తెలంగాణవాది, ఉస్మానియా యూనివర్శిటీ ఆర్ట్స్‌ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్‌ సీనియర్‌ ప్రొఫెసర్‌ కుంభం మధుసూధన్‌ రెడ్డి అంత్యక్రియలు బుధవారం జూబ్లీహిల్స్‌ మహా ప్రస్థానంలో ముగిశాయి. నల్లగొండ జిల్లా మర్రిగూడ శివన్నగూడ గ్రామంలో కుంభం చిన్న శివారెడ్డి, రంగనాయకమ్మ దంపతులకు 1935 ఆగస్టు 21న నాలుగో సంతానంగా జన్మించారు. చిన్నతనంలోనే చదువు నిమిత్తం 1946లో హైదరాబాద్‌కు వచ్చారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఒక ప్రొఫెసర్‌గా, మేధావిగా, భావజాల వ్యాప్తి చేస్తూ ఉద్యమ పాఠాలు బోధిస్తూ క్రియాశీల పాత్ర నిర్వర్తించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పొలిటికల్‌ సైన్స్‌ ప్రొఫెసర్‌గా, హైదరాబాద్‌ ఏవీ కళాశాల గవర్నింగ్‌ బాడీ మెంబర్‌గా, ఆల్‌ ఇండియా పొలిటికల్‌ సైన్స్‌ ప్రొఫెసర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా పనిచేశారు. తెలంగాణ సామాజిక రాజకీయ నిర్మాణం పట్ల లోతైన అవగాహన, పూర్తి సాధికారత కలిగిన తెలంగాణ తొలితరం మేధావి, బహుజన పక్షపాతి, గొప్ప ఆలోచనా విధానం కలిగిన వ్యక్తి మధుసూదన్‌ రెడ్డి. 1969 తొలి తెలంగాణ ఉద్యమానికి, తర్వాత 1996 నుంచి 2014 వరకు జరిగిన తెలంగాణ సాధన ఉద్యమాలకు ప్రేరణగా నిలిచారు. 1996లో పదవీ విరమణ పొందిన ఆయన తెలంగాణ సిద్ధాంతకర్తగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. విద్యా రంగానికి ఆయన చేసిన అపారమైన కృషి తరతరాలుగా ఎంతోమంది విద్యార్థుల జీవితాల్లో మార్పులను తెచ్చిపెట్టింది. తెలంగాణ ఉద్యమ కాలంలో కవి అందెశ్రీతోపాటు రాష్ట్ర కళాకారులకు మర్రిగూడ మండల కేంద్రంలో ఆయన ధూంధాం కార్యక్రమాలను ఏర్పాటు చేసి ప్రజలను జాగృతం చేశారు. ఆయనకు భార్య విమల, ముగ్గురు కుమార్తెలు నళిని, అరుంధతి, గాయత్రి ఉన్నారు. ఒక కూతురు ఎస్‌.బి.ఐ మేనేజర్‌గా, ఒక అల్లుడు పట్నా హైకోర్టు జడ్జిగా పనిచేస్తున్నారు. మరపురాని జ్ఞాపకాలు అనే తన జీవిత చరిత్రను రాసుకున్నట్లు రచయిత మనోహర్‌ రెడ్డి పేర్కొన్నారు. ఆయనను కడసారి చూసేందుకు శివన్నగూడ గ్రామస్తులు హైదరాబాదుకు తరలివచ్చారు. పలువురు ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ సంతాపం వ్యక్తం చేశారు. మధుసూదన్‌రెడ్డి మృతిపట్ల జస్టిస్‌ సుదర్శన్‌ రెడ్డి, జస్టిస్‌ గోపాల్‌ రెడ్డి, జస్టిస్‌ రాజశేఖర్‌ రెడ్డి, మాజీ అడ్వకేట్‌ జనరల్‌ రామచందర్‌ రావు, కాంగ్రెస్‌ నాయకులు కోదండ రెడ్డి, మాజీ మంత్రి జగదీశ్వర్‌ రెడ్డి, గోరటి వెంకన్న, ప్రొఫెసర్‌ ఇటికాల పురుషోత్తం, ప్రొఫెసర్‌ గంట చక్రపాణి, జూలూరి గౌరీశంకర్‌, ప్రొఫెసర్‌ కంచ ఐలయ్య, తెలంగాణ ప్రభాకర్‌, భారత్‌ ఇంజనీరింగ్‌ కాలేజ్‌ వేణుగోపాల్‌ రెడ్డి, స్టాన్లి కృష్ణారావు, ప్రదీప్‌రెడ్డి, ప్రొఫెసర్‌ కిషోర్‌ రెడ్డి, ప్రొఫెసర్‌ గట్టు సత్యనారాయణ, పర్యావరణ శాస్త్రవేత్త పురుషోత్తం రెడ్డి, ప్రొఫెసర్‌ వినాయక్‌ రెడ్డి, గుజ్జ బిక్షం, బాణపురం మధుసూదన్‌ రెడ్డి, జనపక్షం జంగారెడ్డి, డాక్టర్‌ చెరుకు సుధాకర్‌, ప్రొఫెసర్‌ ముత్యం రెడ్డి, ప్రొఫెసర్‌ సిద్ధారెడ్డి, పలు పార్టీల నాయకులు, ప్రముఖులు హాజరై ఆయన భౌతిక కాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You cannot copy content of this page