కోల్ గ్యాసిఫికేషన్‌తో విలువైన వనరుల ఉత్పత్తి

– కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి’

నాగ్‌పూర్, ప్రజాతంత్ర, మార్చి 14: కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుల ద్వారా అమోనియా, హైడ్రోజన్, అమోనియం నైట్రేట్ వంటి విలువైన వనరులను దేశీయంగా ఉత్పత్తి చేసుకునేందుకు వీలవుతుందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. కోల్ గ్యాసిఫికేషన్ ద్వారా బొగ్గు కేవలం విద్యుత్ ఉత్పత్తికి కాకుండా రసాయనాలు, ఎరువులు, ఇతర పారిశ్రామిక ఉత్పత్తుల తయారీలో కీలక ముడి పదార్థంగా మారుతుందని తెలిపారు. ఇందుకోసం అత్యాధునిక సాంకేతితను వినియోగించనున్నట్లు చెప్పారు. మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా భద్రావతిలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌తో కలిసి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రెండు కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులకు శనివారం శంకుస్థాపన చేశారు. అనంతరం కేంద్ర బొగ్గు, గనుల శాఖ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మైన్ క్లోజర్ అంశంలో భాగంగా తాను దత్తత తీసుకున్న మూర్‌పార్ గనిని సందర్శించి సైంటిఫిక్ మైన్ క్లోజర్ పనులను సమీక్షించారు. భద్రావతిలో రెండు కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుల శంకుస్థాపన కార్యక్రమంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాజెక్టులు ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాదిమందికి ఉపాధి అవకాశాలను కల్పించనున్నాయన్నారు. ఈ కార్యక్రమాలు దేశ ఇంధన భద్రత, పారిశ్రామిక అభివృద్ధి, సుస్థిరమైన అభివృద్ధి లక్ష్యాలకు దిశానిర్దేశం చేసే కీలక అడుగులుగా నిలుస్తాయన్నారు. 2030 నాటికి 100 మిలియన్ టన్నుల కోల్ గ్యాసిఫికేషన్ లక్ష్యాన్ని సాధించడానికి కేంద్రం విధానపరమైన, ఆర్థిక ప్రోత్సాహకాలను అందిస్తోందని పేర్కొన్నారు. ఇది ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాన్ని బలపరచడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంdన్నారు. క్లీన్ ఎనర్జీ టెక్నాలజీ అమలు, బాధ్యతాయుత గనుల నిర్వహణ ద్వారా భారత్‌ను ప్రపంచంలో ముందంజలో నిలిపేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. నాగ్‌పూర్ ప్రాంతంలో ప్రారంభమైన ఈ ప్రాజెక్టులు దేశ అభివృద్ధికి కీలక మైలురాయిగా నిలుస్తాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. మూర్‌పార్ గనిని సందర్శించిన మంత్రి శాస్త్రీయ మైన్ క్లోజర్ పనుల ప్రగతిని పరిశీలించి స్థానికులతో మాట్లాడారు. మైన్ క్లోజర్‌పై జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ఏర్పాటైన కమిటీతో చర్చించారు. గనుల తవ్వకం అనంతరం భూమిని పునరుద్ధరించి స్థానిక ప్రజల జీవనోపాధిని కాపాడటం మనందరి బాధ్యత అన్నారు. సరైన ప్రణాళికతో మూసివేసిన గనులను వ్యవసాయం, మత్స్య పరిశ్రమ, సౌర విద్యుత్ ప్రాజెక్టులు, పర్యాటక కేంద్రాలు, ఇతర అభివృద్ధి కార్యక్రమాల కోసం వినియోగించవచ్చని తెలిపారు. మైన్ క్లోజర్ ప్రక్రియలో స్థానిక ప్రజల భాగస్వామ్యం, నైపుణ్యాభివృద్ధి, ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. గనులపై ఆధారపడిన కుటుంబాల భవిష్యత్తు భద్రంగా ఉండేలా ప్రభుత్వం సమగ్ర ప్రణాళికలను అమలు చేస్తోందని తెలిపారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *