ఆరు గ్యారంటీల అమలుకు ప్రైవేటు బిల్లు

– ప్రవేశపెట్టనున్న బీఆర్ఎస్
– బిల్లును అనుమతించాలని స్పీకర్, మండలి చైర్మన్‌ను కోరతాం
– స్పష్టం చేసిన బీఆర్ఎస్ నేతలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 21: ఆరు గ్యారంటీల పేర్లు చెప్పి రాష్ట్రంలోని అన్ని వర్గాలను మోసం చేసిన ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికి ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టనున్నట్లు బీఆర్‌ఎస్ పార్టీ తెలిపింది. అధికారంలోకి వచ్చిన తొలి రోజే ముఖ్యమంత్రి ఆరు గ్యారంటీల అమలు ఫైలుపై సంతకం చేశారని, వారం తర్వాత అప్పటి రాష్ట్ర గవర్నర్‌తో అసెంబ్లీ ఉభయ సభల సమావేశంలో చెప్పించారని తెలిపింది. 800 రోజులైనా 6 గ్యారంటీల అమలుకు అతీగతీలేదని, అందుకే ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఈ బిల్లును ప్రవేశపెట్టబోతున్నామని ఆ పార్టీ ఎమ్మెల్యేలు తెలిపారు. ఈ సమావేశాల్లోనే ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెడతామని, అసెంబ్లీ స్పీకర్ కార్యాలయాన్ని, మండలి చైర్మన్ కార్యాలయాన్ని కలిసి బిల్లును అనుమతించాలని కోరుతామని తెలిపారు. 6 గ్యారంటీల అమలుపై కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఈ ప్రైవేట్ మెంబర్ బిల్లును సభలో అనుమతించాలని ఆ పార్టీ డిమాండ్ చేసింది. గతంలో ఎన్టీఆర్ ప్రభుత్వ హయాంలో ప్రైవేటు మెంబర్ బిల్లును ప్రభుత్వం ఆమోదించి ప్రజల పట్ల చిత్తశుద్ధిని చాటుకుందని గుర్తు చేసింది. ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రభుత్వాలు ఆమోదించే సంప్రదాయం రాష్ట్రంలో ఉంది కాబట్టి ఈ ఆరు గ్యారంటీల అమలు కోసం తమ పార్టీ పెడుతున్న ప్రైవేటు మెంబర్ బిల్లును కాంగ్రెస్ పార్టీ ఆమోదించాలని బీఆర్‌ఎస్ స్పష్టం చేసింది. పాలక పక్షం, ప్రతిపక్షం రెండు కోరుతున్నాయి కాబట్టి ఈ బిల్లు ఆమోదం సులభంగా జరుగుతుందని తెలిపింది. రైతులు, మహిళలు, విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు, యువకులు ఇలా ప్రతి ఒక్క వర్గం తరఫున ఈ బిల్లును ప్రతిపాదిస్తున్నామని తెలిపింది. ఈ బిల్లు చట్టం అయితే రైతన్నలకు రైతుబంధు ఎగగొట్టడానికి ప్రభుత్వానికి వీలుండదని, ముఖ్యమంత్రి ఖచ్చితంగా రైతుబంధు సహా ఇచ్చిన అన్ని హామీలు అమలు చేయాల్సి వస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తెలిపారు. ఈ ప్రైవేట్ బిల్లు చట్టం అయితే ప్రభుత్వ ఎగవేతలకు కళ్లెం వేస్తుంది.. ప్రతి ఒక్క లబ్ధిదారుడికి ఖచ్చితంగా లబ్ధి చేకూరేందుకు వీలవుతుంది.. ఈ చట్టం వల్ల అన్నదాతలకు, ఆటో అన్నలకు, మహిళలకు, విద్యార్థులకు ప్రతి ఒక్కరికీ లబ్ధి కలుగుతుంది.. అని వివరించారు. ఈ బిల్లును ప్రవేశపెట్టిన తర్వాత అన్ని పార్టీల నేతలను కలిసి మద్దతు ఇవ్వాలని కోరుతామని, అవసరమైతే లేఖలు రాస్తామని తెలిపింది. పార్టీలకతీతంగా ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ ఈ బిల్లు అమలు కోసం స్థానిక ఎమ్మెల్యేలపై ఒత్తిడి చేయాలని కోరింది. బిల్లుకు సంబంధించి ప్రజల నుంచి సలహాలు, సూచనలు తీసుకొని ప్రభుత్వానికి ప్రతిపాదిస్తామని బీఆర్ఎస్ పార్టీ తెలిపింది. కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పి మాట తప్పి 800 రోజులైన నేపథ్యంలోనే తామే స్వతహాగా ఈ బిల్లు తీసుకువస్తున్నామని బీఆరఎస్ ఎమ్మెల్యేలు తెలిపారు. ఒకవేళ ఈ బిల్లును కాంగ్రెస్ పార్టీ శాసనసభలో అనుమతించకుంటే చట్టపరంగా ఉన్న ఇతర మార్గాలను కూడా ఉపయోగించుకుంటామన్నారు.


తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter)Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి..   మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *