– ఇద్దరి మృతి, ఒకరికి తీవ్ర గాయాలు
కామారెడ్డి, ప్రజాతంత్ర, ఏప్రిల్ 11: కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం రామేశ్వర్‌పల్లి వద్ద 44వ జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వైపు వెళ్తున్న అంబులెన్స్‌ను వేగంగా దూసుకొచ్చిన ప్రైవేటు బస్సు వెనక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అంబులెన్స్‌లో ఉన్న పేషెంట్ సలేహ భాను(63), అంబులెన్స్ డ్రైవర్ షేక్ సర్దార్ (35) ఘటనా స్థలిలోనే మృతి చెందారు. పేషెంట్ భర్త సైఫుల్లా ఖాన్(76) తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని గాయపడిన వ్యక్తిని స్థానిక హాస్పిటల్‌కి తరలించారు. సలేహ భాను ఆరోగ్యం క్షీణించడంతో ఆమెను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ నుంచి ఆదిలాబాద్‌లోని స్వగ్రామానికి తరలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ప్రైవేట్ బస్సు ఢీకొనడంతో అంబులెన్స్ తీవ్రంగా దెబ్బతిన్నట్లు సమాచారం. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బస్సు డ్రైవర్‌పై నిర్లక్ష్యంగా వాహనం నడపడం, అతి వేగం వంటి ఆరోపణలతో కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ప్రమాదంతో కొద్దిసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడగా పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.
లారీని ఢీకొన్న ట్రావెల్స్ బస్సు : 16మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు
సూర్యాపేట : సూర్యాపేట జిల్లా కోదాడ బైపాస్ వద్ద జాతీయ రహదారిపై లారీని ట్రావెల్స్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో 16 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను కోదాడ ప్రభుత్వ హాస్పిటల్‌కు తరలించారు. బస్సు హైదరాబాద్ నుంచి ఏలూరు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు ఉన్నారు. డ్రైవర్ నిద్ర మత్తు కారణంగా ప్రమాదం జరిగిందని ప్రయాణికులు అంటున్నారు.
——-
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.
————————————————————————————————————————————————————-



