– వాట్సాప్ ప్రైవసీ పాలసీపై విచారణ
– ఇక్కడి చట్టాలను గౌరవించకుంటే వెళ్లిపోండి
– మెటా సంస్థ తీరుపై సుప్రీం కోర్టు ఆగ్రహం
న్యూదిల్లీ, ఫిబ్రవరి 3: ప్రైవసీ పాలసీ విషయంలో వాట్సప్ మాతృ సంస్థ మెటాపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరు మా దేశ గోప్యతతో ఆడుకోలేరు. మా డేటాలోని ఒక్క అంకెను కూడా పంచుకోవడానికి మేం అనుమతించం. ఒకవేళ దేశ చట్టాలను పాటించకపోతే భారత్‌ను వీడి వెళ్లొచ్చని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ హెచ్చరించారు. 2021లో వాట్సప్‌లో గోప్యతా విధానానికి సంబంధించిన ఓ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది. తమ వాణిజ్య ప్రయోజనాల కోసం వాట్సప్ వినియోగదారుల డేటాను మెటాతో పంచుకుంటోందని, ఇది దోపిడీ కిందకే వస్తుందని ప్రభుత్వం తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి స్పందిస్తూ.. మెటాను హెచ్చరించారు. వాట్సాప్ ప్రైవసీ పాలసీపై అసహనం వ్యక్తం చేసారు. భారత్‌లో కార్యకలాపాలు సాగించాలంటే ఇక్కడి చట్టాలను పాటించి తీరాల్సిందేనని స్పష్టం చేసారు. మా దేశ గోప్యతతో రు ఆడుకోలేరు. మా డేటాకు సంబంధించి ఒక్క అంకెను పంచుకోవడానికి కూడా మిమ్మల్ని అనుమతించము’ అని అమెరికాకు చెందిన మెటాను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ మందలించారు. దేశ చట్టాలను పాటించకపోతే భారతదేశం విడిచి వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించారు.
వాణిజ్య ప్రయోజనాల కోసం వినియోగదారుల డేటాను పంచుకోవడం దోపిడీ అని ప్రభుత్వం తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు. దేశంలోని లక్షలాదిమంది పేదలు, చదువురాని ప్రజలు ప్రైవసీ పాలసీని అర్థం చేసుకోగలరా అని మెటా ప్రతినిధులను చీఫ్ జస్టిస్ సూటిగా ప్రశ్నించారు. కొన్ని సందర్భాల్లో మెటా పాలసీలు అర్థం చేసుకోవడం తమకే ఇబ్బందిగా మారుతోందని, అలాంటప్పుడు గ్రామీణ భారత ప్రజలకు ఎలా అర్థం అవుతుందని ప్రశ్నించారు. కాగా, మెటా ఇంజినీరింగ్ బృందం ఇతరుల వాట్సాప్ మెసేజ్‌లను చదవగలదని వాట్సాప్ అంతర్జాతీయ వినియోగదారుల బృందం ఇటీవల అమెరికా కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా సుప్రీంకోర్టు హెచ్చరికలు మెటాను మరింత ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నాయి. ఒకసారి తనకు ఓ వైద్యుడు వాట్సప్‌లో మందుల ప్రిస్క్రిప్షన్ పంపితే దానికి సంబంధించిన ప్రకటనలే ఫోన్‌లో కనిపించాయన్నారు. ఇక దేశంలోని లక్షలాదిమంది పేద, చదువురాని ప్రజలు ఈ విధానాలను ఎలా అర్థం చేసుకుంటారని చీఫ్ జస్టిస్ ప్రశ్నించారు. 2021 జనవరిలో వాట్సప్ కొత్త ప్రైవసీ పాలసీని తీసుకొచ్చింది. దీని ప్రకారం యూజర్లు వాట్సప్ బిజినెస్ అకౌంట్లతో జరిపే సంభాషణకు సంబంధించిన సమాచారాన్ని ఫేస్‌బుక్‌తో పంచుకొనేందుకు అనుమతి లభిస్తుంది. కొత్త పాలసీకి అంగీకరించని వారి ఖాతాలను రద్దు చేస్తామని తొలుత హెచ్చరించింది. కానీ, దీనిపై తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తమైంది. దీనిపై జోక్యం చేసుకొన్న కేంద్ర ప్రభుత్వం వెంటనే పాలసీ అమలును నిలిపివేయాలని ఆదేశించింది. ఐటీ చట్టంలోని నిబంధనలకు ఈ కొత్త పాలసీ పూర్తి విరుద్ధంగా ఉందని తేల్చి చెప్పింది.
తెలుగు జాతీయ వార్తలు, ప్రత్యేక కథనాలు, ట్రెండింగ్ వీడియోలు కోసం Prajatantra వెబ్‌సైట్ ను సందర్శించండి. తాజా అప్‌డేట్స్ కోసం మా X (Twitter), Facebook, WhatsApp ఛానల్ ను ఫాలో కండి.. అలాగే మా ప్రజాతంత్ర, యూట్యూబ్ చానల్ ను సబ్ స్క్రైబ్ చేసుకోండి.. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పంచుకోండి. మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో షేర్ చేయడం మర్చిపోవద్దు.





